రైలింజన్ సర్కస్ ఫీట్ గుర్తు లేదా పవన్..?
మెగా హీరోలంతా కలసి రైలెక్కి రచ్చ చేసినా కూడా చిరంజీవికి పాలకొల్లులో పరాజయం తప్పలేదు. పిఠాపురంలో పవన్ సంగతి వేరే చెప్పాలా..?
పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చారు. త్వరలో చిరంజీవి కూడా వస్తారని అంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలంతా పవన్ కల్యాణ్ కి మద్దతుగా ప్రచారానికి వస్తారని, ఈసారి జనసేనాని విజయం ఖాయమని అంటున్నారు. సినిమా హీరోల ప్రచారానికి ఓట్లు రాలతాయని ధీమాగా ఉన్నారు. అసలింతకీ అక్కడ మెగా హీరోలకు అంత సీన్ ఉందా..? వారు ప్రచారానికి వస్తే నిజంగానే ఓట్లు పడతాయా..?
2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు పవన్ కల్యాణ్. 2009లో పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు చిరంజీవి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కల్యాణ్ కి మద్దతుగా చిరంజీవి ప్రచారానికి వస్తారట, పవన్ గెలిచిపోతారట. ఇదీ అక్కడ జరుగుతున్న చర్చ. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్టు అన్నదమ్ములిద్దరూ వారాహి ఎక్కి రంకెలేస్తే జనం ఓట్లు వేస్తారా..? రాజకీయాలకు నేను దూరం దూరం అంటూనే ఇటీవల ముసుగు తీసేసిన చిరంజీవి, పవన్ కి మద్దతుగా ప్రచారానికి వస్తే జనం ఆదరిస్తారా..? ప్రజారాజ్యం పార్టీ, టీడీపీ వల్లే చరిత్రలో కలసిపోయిందని చెప్పిన మెగాస్టార్.. ఇప్పుడదే కూటమికి ఓట్లు వేయాలని ఎలా అడగగలరు..? పవన్ కి టీడీపీ నేత గుండు గీయించారంటూ.. అప్పట్లో ఆ పార్టీ నేతలు, ఎల్లో మీడియా ఓ రేంజ్ లో పరువు తీసింది. ఆ సంగతులన్నీ పవన్, చిరంజీవి మరచిపోయినా జనం మరచిపోలేదు.
టీడీపీతో కలవడమే పవన్ కల్యాణ్ చేసిన పెద్ద తప్పు. పైగా చంద్రబాబుని వెంటేసుకుని ప్రజాగళం పేరుతో పర్యటనలు కూడా. నాడు తిట్టిన బాబుని నేడు అదే నోటితో పొగిడేస్తున్నారు. ఆయన వీరుడు, శూరుడు, విజనరీ అంటున్నారు. తన తల్లిని తిట్టినా పర్లేదు, తనని తిట్టినా పర్లేదు, తన అన్న పార్టీని నాశనం చేసినా పర్లేదు.. బాబు ప్యాకేజీ తనకు చాలు అని సరిపెట్టుకున్నారు. జనసైనికులకు ఇది మింగుడు పడని విషయమే అయినా పైకి సర్దుకుపోయిట్టు కనపడుతున్నారు, లోలోపల రగిలిపోతున్నారు. పిఠాపురంలో పవన్ విజయం కూడా ఇప్పుడు కష్టమని తేలిపోయింది. అందుకే వరుణ్ తేజ్ దిగిపోయారు, చిరంజీవి దిగుతున్నారు. రాబోయే రోజుల్లో మిగతా హీరోలు కూడా వస్తారేమో చూడాలి. మెగా హీరోలంతా కలసి రైలెక్కి రచ్చ చేసినా కూడా చిరంజీవికి పాలకొల్లులో పరాజయం తప్పలేదు. పిఠాపురంలో పవన్ సంగతి వేరే చెప్పాలా..?