రూమ్‌మెట్స్‌పై మెడిక‌ల్ విద్యార్థి హ‌త్యాయ‌త్నం.. మ‌ద్యం మ‌త్తులో దారుణం

తిరుపతి జిల్లా వెంకటగిరి మండలానికి చెందిన గణేశ్ ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతూ యూజీ హాస్టల్లో ఉంటున్నాడు.

Advertisement
Update:2023-08-16 08:11 IST

వారు ముగ్గురూ మెడిక‌ల్ విద్యార్థులు. తిరుపతి శ్రీవేంకటేశ్వర మెడిక‌ల్ కాలేజీలో ఒక‌రు థ‌ర్డ్ ఇయ‌ర్‌.. మ‌రో ఇద్ద‌రు ఫైన‌లియ‌ర్ చ‌దువుతున్నారు. మ‌ద్యం బిల్లు చెల్లించే విష‌యంలో వారి మ‌ధ్య వివాదం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో రూమ్‌కి వెళ్లిన త‌ర్వాత ఫైన‌లియ‌ర్ విద్యార్థులు ఇద్ద‌రూ నిద్ర‌పోగా, థ‌ర్డ్ ఇయ‌ర్ విద్యార్థి వారిపై క్రికెట్ స్టంప్‌తో, క‌త్తితో దాడికి దిగాడు. ఈ ఘ‌ట‌న‌లో వారిద్ద‌రూ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు తిరుప‌తి ప‌డ‌మ‌ర సీఐ జ‌య‌నాయ‌క్‌ చెప్పిన వివ‌రాలిలా ఉన్నాయి.

తిరుపతి జిల్లా వెంకటగిరి మండలానికి చెందిన గణేశ్ ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతూ యూజీ హాస్టల్లో ఉంటున్నాడు. అదే గదిలో ఫైనలియర్ విద్యార్థులు నందలూరుకు చెందిన మహేశ్, పలమనేరుకు చెందిన ప్రవీణ్ ఉంటున్నారు. సోమవారం సాయంత్రం ముగ్గురూ కారులో బయటకు వెళ్లి మద్యం తాగారు. బిల్లు చెల్లించే విషయమై వారి మధ్య విభేదాలు వచ్చాయి. గతంలోనూ వీరి మధ్య గొడవలు జరిగినట్టు సమాచారం.

తాజా వివాదం తర్వాత సీనియర్లు తనతో మాట్లాడకపోవడంతో తొలుత గణేశ్ వారిని నిలదీశాడు. అనంత‌రం వారు నిద్రలోకి జారుకున్న త‌ర్వాత గణేశ్.. తన గదిలోని క్రికెట్ స్టంప్‌తో మహేశ్ తలపై కొట్టాడు. మహేశ్ అరుపులు విని లేచి, అడ్డుకోబోయిన ప్రవీణ్ పైనా దాడికి తెగబడ్డాడు. ఏకంగా స్టంప్ విరిగిపోయింది. అనంతరం హాస్టల్ వంట గదిలోని కూరగాయల కత్తితో మహేశ్ గొంతుపై కోశాడు. బాధితులు పెద్ద పెద్ద‌ కేకలు వేయడంతో సహచర విద్యార్థులు రావడాన్ని గమనించిన గణేశ్ అక్కడి నుంచి ప‌రార‌య్యాడు.

భద్రతా సిబ్బంది బాధితులను రుయా అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు మహేశ్‌కు సర్జరీ చేశారు. ప్రవీణ్ తలకు తీవ్ర గాయం కావ‌డంతో చికిత్స అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి పడమర పోలీసులు తెలిపారు. గ‌ణేశ్ కోసం గాలిస్తున్న‌ట్టు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News