జగన్ కి మందు అలవాటు లేదు.. అందుకే ఆ తప్పు జరిగింది
ఏపీ లిక్కర్ పాలసీ కూడా మందుబాబుల్లో అసంతృప్తికి కారణం అయిందని వివరించారు మార్గాని భరత్. లిక్కర్ పాలసీ అలా ఉండటానికిి కారణం జగన్ కి మందు అలవాటు లేకపోవడమేనన్నారు.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి రకరకాల కారణాలు చెబుతున్నారు నేతలు. ఈవీఎంలు, చంద్రబాబు వాగ్దానాలు, వైసీపీ చేసిన మంచిని తగినంతగా ప్రచారం చేసుకోలేకపోవడం.. ఇలాంటివన్నీ కారణాలేనంటున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ మరో కొత్త కారణం చెప్పారు. లిక్కర్ పాలసీ కూడా మందుబాబుల్లో అసంతృప్తికి కారణం అయిందని వివరించారాయన. లిక్కర్ పాలసీ అలా ఉండటానికిి కారణం జగన్ కి మందు అలవాటు లేకపోవడమేనన్నారు.
భరత్ ఏమన్నారంటే..?
"ఎవరు ఔనన్నా కాదన్నా లిక్కర్ అనేది మేజర్ ఇష్యూ అని చెప్పాలి. జగనన్న టీ తాగుతారు, లిక్కర్ ఆయన తీసుకోరు, సో ఆయనకు ఈ విషయం తెలియదు. దీని ప్రభావం ఇంత ఉంటుందా అనేది ఆయనకు తెలియదు. ఇన్ని బ్రాండ్స్ ఉంటాయా, జనం వాటిని ఇష్టపడతారా..? అనేది ఆయనకు తెలియదు. సూపర్ మార్కెట్ కి వెళ్తే నాలుగైదు టూత్ పేస్ట్ లు చూసి ఒకటి తీసుకుంటాం. లిక్కర్ షాప్ కి వెళ్లేవారు మూడు నాలుగు రకాలు చూసి, ఒకటి తీసుకుంటారు. లిక్కర్ బ్రాండ్లు అన్నీ కూడా ఉండి ఉంటే బాగుండేది. తాగుబోతుల్ని తగ్గించాలని ఆయన అనుకున్నారు, కానీ కుదర్లేదు." అంటూ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు మార్గాని భరత్.
తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు సరైన ప్రచారం చేసుకోలేకపోయామన్నారు మార్గాని భరత్. అది కూడా తమ ఓటమికి ఒక కారణం అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా పెన్షన్ 3వేల రూపాయలే వస్తుందని, చంద్రబాబుకి ఓటు వేస్తే ఒకేసారి బకాయిలతో కలిపి 7వేల రూపాయలు తీసుకోవచ్చని ప్రజలు భావించారని అందుకే కూటమికి ఓటు వేశారని వివరించారు. అంటే ఓటుకి 4వేల రూపాయలు కూటమి ఇచ్చినట్టు అనుకోవచ్చని చెప్పారు. వైసీపీ ఓటమిపై పోస్ట్ మార్టమ్ జరుగుతోందని, కారణాలు విశ్లేషించుకుంటున్నామని అన్నారు. తాము ఓడిపోయినా 40శాతం మంది రాష్ట్ర ప్రజల మద్దతు తమకే ఉందన్నారు మార్గాని భరత్.