మార్గదర్శిలో ఇంత జరుగుతోందా.? ప్రాథమిక నివేదికలో విస్తుపోయే నిజాలు!

భారీ మొత్తంలో సొమ్మును, చట్ట విరుద్దంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా లభ్యమయ్యాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు అంటున్నారు.

Advertisement
Update:2022-11-24 06:23 IST

ఏపీ ప్రభుత్వ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ.. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు చిట్‌ఫండ్ కంపెనీలపై ఇటీవల దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా ఉన్నది. అధికారులు జరిపిన తనిఖీల్లో మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలు మొత్తం బయటపడ్డాయి. భారీ మొత్తంలో సొమ్మును, చట్ట విరుద్దంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా లభ్యమయ్యాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఇందులో అనేక విస్తుపోయే నిజాలను వెల్లడించారు.

గత వారం మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు రెవెన్యూ ఇంటెలిజెన్స్ టీమ్‌లు మూడు రోజులు సోదాలు జరిపాయి. 1982 చిట్ ఫండ్ చట్టానికి విరుద్దంగా నిర్వహిస్తున్న లావాదేవీలకు సంబంధించి అనేక రికార్డులు ఉన్నాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మార్గదర్శి తమ ఖాతాదారుల సొమ్మును ఎలా అక్రమంగా ఇతర అకౌంట్లకు తరలించిందో బయటపడిందని అధికారులు అంటున్నారు. మార్గదర్శిలో చీటీ వేసిన ఖాతాదారులు ఎవరైనా అవసరాల నిమిత్తం చీటీ పాడితే.. వెంటనే సొమ్ములు చెల్లించడం లేదు. ష్యూరిటీలు, బ్యాంక్ గ్యారంటీలు అని చెబుతూ చీటీ పాడిన మూడు నెలల తర్వాత ఖాతాదారుడికి చెల్లిస్తున్నారు.

వాస్తవానికి చీటీ పాడిన వినియోగదారుడు సరైన సమయంలో ష్యూరిటీలు ఇవ్వకపోతే ఆ సొమ్మును వేరే ఖాతాతో జమ చేసి ఉంచాలి. అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత ఖతాదారుడికి సదరు సొమ్ము చెల్లించాలి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ అలా చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ఖాతాదారుల సొమ్మును మూడు నెలల పాటు చట్ట విరుద్దంగా ఎఫ్‌డీ అకౌంట్లకు బదిలీ చేస్తోందని అంటున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఖాతాదారుల సొమ్మును వాడుతున్నట్లు గుర్తించారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వల్ల పొందుతున్న రాబడి భారీగా ఉందని స్పష్టం చేస్తున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ తమ వ్యాపారం ద్వారా సంపాదించే లాభం కంటే.. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా వచ్చే ఆదాయమే 5 రెట్లు ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే ఖాతాదారులకు చెల్లించాల్సిన సొమ్మును మూడు నెలల పాటు ఇతర ఖాతాల్లోకి తరలిస్తోందని అధికారులు చెప్తున్నారు.

ఇక చిట్స్ వేసే చాలా గ్రూపుల్లో 30 నుంచి 40 శాతం నిండటం లేదని.. వాటిని కంపెనీయే బినామీ పేర్లతో నింపుతోందని తెలుస్తోంది. అసలైన ఖాతాదారులు చీటీలు పాడినా వారికి చెల్లింపులు లేట్ అవుతున్నాయి. కానీ, అదే సమయంలో బినామీ పేర్లతో చీటీ పాడి వాటి డబ్బును కంపెనీనే తమ వద్ద పెట్టుకుంటోంది. అసలు ఖాతాదారులకు చివర్లో చెల్లింపులు చేస్తూ.. వారి డబ్బును భారీగా ఇతర పెట్టుబడులకు మళ్లిస్తోందని నివేదికలో వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ క్యాపిటల్ రూ. 2 కోట్లుగా ఉన్నది. అయితే నగదు నిల్వలు రూ. 1,697 కోట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ. 768 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 459 కోట్లు, ఖాతాదారులకు చెల్లించాల్సిన సొమ్ము రూ. 580 కోట్లుగా చూపించారు. కంపెనీ వద్ద నగదు నిల్వలు ఉన్నా.. ఖాతాదారులకు మాత్రం సరైన సమయంలో చెల్లించకుండా ఇతర పెట్టుబడుల ద్వారా భారీగా వడ్డీ సంపాదిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక మార్గదర్శి ఇప్పటి వరకు తమ వద్ద ఎంత మంది ఖాతాదారులు ఉన్నారో ఏనాడూ వెల్లడించలేదు. అంతే కాకుండా కంపెనీ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు కూడా బ్యాలెన్స్ షీట్‌లో లేవు. ఇక ప్రతీ చిట్ గ్రూప్‌కు ఒక బ్యాంక్ అకౌంట్ తెరవాలనే నిబంధనను ఏనాడూ పాటించలేదని అధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News