ప్రజారాజ్యం, టీడీపీ, జనసేనను నమ్మి మోసపోయా..
సిద్ధాంతాలు, భావజాలంపై పవన్ మాటలు విని జనసేనకు ఆకర్షితురాలినయ్యానని శేషుకుమారి చెప్పారు. కానీ చంద్రబాబును మోయడమే పవన్ సిద్ధాంతమని ఆమె మండిపడ్డారు.
ప్రజారాజ్యం, టీడీపీ, జనసేన పార్టీలను నమ్మి తాను మోసపోయానని జనసేన పార్టీ పిఠాపురం మాజీ ఇన్‌చార్జి మాకినీడి శేషుకుమారి చెప్పారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజారాజ్యం, టీడీపీ, జనసేన పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసిన ఆమె.. తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీలో నియంతృత్వ ధోరణి ఉందని శేషుకుమారి విమర్శించారు. నాయకుల మధ్య సమన్వయం లేదని ఆమె చెప్పారు. గోదావరి జిల్లాల్లో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని తన ఇమేజ్‌ను పెంచుకున్నారని విమర్శించారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంతం నానాజీ జనసేన పార్టీని నాశనం చేశారని ఆమె తెలిపారు.
సిద్ధాంతాలు, భావజాలంపై పవన్ మాటలు విని జనసేనకు ఆకర్షితురాలినయ్యానని శేషుకుమారి చెప్పారు. కానీ చంద్రబాబును మోయడమే పవన్ సిద్ధాంతమని ఆమె మండిపడ్డారు. రాజకీయం అంటే సినిమా డైలాగులు చెప్పడం, స్క్రిప్టు చదవడమని పవన్ అనుకుంటున్నారని ఆమె విమర్శించారు. జనసేన నమ్ముకున్నందుకు తన రాజకీయ జీవితం వృథా అయిపోయిందని ఆమె చెప్పారు. అంతేకాదని.. జనసేనలో తనను మానసికంగా క్షోభకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నాయకుడంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని.. ఆయన్ని చూశాక సరైన నాయకుడిని, పార్టీని ఎన్నుకున్నానని అనిపించిందని శేషుకుమారి తెలిపారు. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌కి ఓటమి ఖాయమని ఆమె స్పష్టం చేశారు. పిఠాపురంలో వైసీపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థి వంగా గీత.. రాజకీయంగా ఓటమి ఎరుగని మహిళ నాయకురాలని ఆమె చెప్పారు. పిఠాపురం ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్న వంగా గీతకు గెలుపు తథ్యమని ఆమె తేల్చిచెప్పారు.