పవన్ కల్యాణ్‌కు ఎదురు తిరిగిన మహాసేన రాజేష్

జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. తమకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదని, అన్యాయానికి గురవుతున్న ప్రజల తరఫున పోరాటం చేయడమే తమకు ఇష్టమని రాజేష్ అన్నారు.

Advertisement
Update:2024-05-07 16:47 IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మహాసేన రాజేష్ ఎదురు తిరిగారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనను ఓడించి తీరుతామని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ కు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. పవన్‌తో పోలిస్తే జగన్ బెటర్ అనిపిస్తోందని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.

కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడాలని అంబేడ్కర్ చెప్పాడని, పవన్ కల్యాణ్ వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు తెలియజేస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే చాలా సహించామని చెప్పారు.

జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. తమకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదని, అన్యాయానికి గురవుతున్న ప్రజల తరఫున పోరాటం చేయడమే తమకు ఇష్టమని రాజేష్ అన్నారు.

పదవులు కావాలనుకుంటే జగన్ తోనే ఉండేవాళ్లమని, పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనప్పుడు తాము కూడా నిలకడగా ఉండలేమని ఆయన అన్నారు. ఫేస్ బుక్ వేదికగా ఆయన ఈ పోస్ట్ పెట్టారు. మహాసేన రాజేష్ తీసుకున్న నిర్ణయం ఎన్డీఏ కూటమికి మింగుడు పడడం లేదు.

మహాసేన రాజేష్ 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీలో చేరి ఆ పార్టీ కోసం పనిచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొంత కాలానికి జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మహాసేన మీడియా పేరుతో యూట్యూబ్ చానల్, సోషల్ మీడియా ఖాతాలు తెరిచారు. ఆ తర్వాత జనసేనకు చేరువయ్యారు. కొత్త పార్టీ పెట్టాలని కూడా అనుకున్నారు. దాన్ని విరమించుకుని టీడీపీలో చేరారు.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజేష్‌కు పి. గన్నవరం అసెంబ్లీ సీటును కేటాయించారు. అయితే, రాజేష్ కు వ్యతిరేకంగా ఆందోళనలు మొద‌ల‌య్యాయి. దాంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సీటును చంద్రబాబు జనసేనకు కేటాయించారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మ‌హాసేన రాజేష్‌ పవన్ కల్యాణ్ మీద తిరుగుబాటు ప్రకటించడంతో చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.

రాజేష్‌ను ఎక్కడికీ రానీయొద్దని, తొక్కేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. దాంతో మ‌హాసేన రాజేష్ పవన్ కల్యాణ్ మీద తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ను కూడా ఓడిస్తామని ఆయన అన్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ వంద శాతం ఓడిపోతారని చెప్పారు. ఈ క్ర‌మంలోనే వైఎస్ జగన్ ను ఆయన ప్రశంసించారు.

Tags:    
Advertisement

Similar News