ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డికీ తప్పని లోన్ యాప్ వేధింపులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డికీ లోన్ యాప్ వేధింపులు తప్పలేదు. అశోక్ అనే వ్యక్తి 9 లక్షల లోన్ తీసుకున్నాడని, అతని ఫోన్ నెంబర్లలో మంత్రి ఫోన్ నెంబరు కూడా ఉందని తెలుస్తోంది. అందువల్ల రికవరీ ఏంజెంట్లు మంత్రి కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.

Advertisement
Update:2022-07-29 16:45 IST

తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు మధ్యతరగతి కుటుంబాల తలిదండ్రులు, వారి కుమారులో, కూతుళ్ళో ఈ వేధింపులకు గురవుతున్న ఉదంతాలు విన్నాం.. ఈ ఆగడాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నవారి విషాద ఘటనలు తీవ్ర కలవరాన్ని కలిగిస్తున్నాయి.


తాజాగా ఇప్పుడు సాక్షాత్తూ ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి కూడా లోన్ యాప్ ఏజంట్ల బారిన పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అశోక్ అనే వ్యక్తి సుమారు 9 లక్షల లోన్ తీసుకున్నాడని, అతని ఫోన్ నెంబర్లలో మంత్రి ఫోన్ నెంబరు కూడా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ నెంబరుకు ఏజంట్లు చాలాసార్లు ఫోన్ చేశారని, కాకాణి పీఏ 25 వేలరూపాయలు చెల్లించినట్టు సమాచారం. కానీ తిరిగి ఈ కాల్స్ బెడద తప్పలేదు.. దీనిపై మంత్రి పీఏ శంకర్ ఈ విషయాన్ని ఆయనకు తెలియజేశారు.


షాక్ తిన్న ఆయన స్పందిస్తూ.. గడప గడపకూ కార్యక్రమంలో ఉన్న తనకీ విషయం తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. గంటలో వంద కాల్స్ వచ్చాయని ఆయన వెల్లడించారు. కాకాణి ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు నలుగురు రికవరీ ఏజంట్లను అరెస్టు చేశారు. అయితే చెన్నై నుంచి పదిమంది అడ్వొకేట్లు వచ్చి వారిని విడిపించుకుపోయారని కాకాణి వివరించారు.

ఈ లోన్ యాప్ వేధింపుల వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 25 న కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్ల నుంచి మంత్రి కాకాణికి ఫోన్ వచ్చిందని, ఆయన పీఏ శంకర్ మాట్లాడగా.. మీరు లోన్ తీసుకున్నారని, కట్టకపోతే మీ పిల్లలను చంపేస్తామని బెదిరించారని తెలిసింది. అసభ్యంగా మాట్లాడడంతో శంకర్ 25 వేలు చెల్లించారట.. కానీ ఏజెంట్లు మళ్ళీ కాల్స్ చేసి వేధించడంతో శంకర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి చెన్నై వెళ్లి నలుగురు ఏజంట్లను అరెస్టు చేశారు. కోల్ మాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వివిధ బ్యాంకులకు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు లోన్ రికవరీ ఏజెన్సీగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అశోక్ అనే వ్యక్తి తన ఫోన్ నెంబర్లలో మంత్రి కాకాణి ఫోన్ నెంబర్ కూడా ఎందుకిచ్చాడన్నది తెలియడంలేదు.

Tags:    
Advertisement

Similar News