టీడీపీకి గుడ్‌బై చెబుతున్న సీనియర్లు - తాజాగా లింగమనేని రాజీనామా

సొంత సామాజికవర్గం నేతలే చంద్రబాబు విధానాలు, లోకేష్‌ తీరు నచ్చక పార్టీని వీడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితి ఇక్కడితో ఆగదని ముందుముందు మరికొందరు సీనియర్‌ నేతలు కూడా వారి బాటలోనే నడవనున్నారని సమాచారం.

Advertisement
Update:2024-01-12 21:06 IST

తెలుగుదేశం పార్టీకి వరుసగా కోలుకోలేని షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో ముఖ్య నేతలుగా భావిస్తున్నవారు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి గుడ్‌బై చెప్పి జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఆయన విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు మూడో జాబితాలో ఆ పార్టీ కన్‌ఫర్మ్‌ చేసేసింది. మరోపక్క తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు కూడా పార్టీకి రాజీనామా చేశారు. తన సతీమణితో సహా ఆయన జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. తాజాగా లింగమనేని శివరామప్రసాద్‌ కూడా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న ఆయ‌న‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా తన రాజీనామాను ప్రకటించారు. అంత‌కు ముందు గుంటూరు జిల్లాకు చెందిన నేత రాయపాటి రంగారావు కూడా టీడీపీకి రాజీనామా చేశారు.

సొంత సామాజికవర్గం నేతలే చంద్రబాబు విధానాలు, లోకేష్‌ తీరు నచ్చక పార్టీని వీడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితి ఇక్కడితో ఆగదని ముందుముందు మరికొందరు సీనియర్‌ నేతలు కూడా వారి బాటలోనే నడవనున్నారని సమాచారం. ఎన్నికల సమయంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు పార్టీకి కోలుకోలేని దెబ్బేనని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News