ప్రతిపక్ష హోదా.. ఎవరు మాట్లాడినా కౌంటర్ రెడీ..!
టీడీపీ నేతల వైఖరి చూస్తే ప్రతిపక్ష హోదాకోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఏపీలో ప్రతిపక్ష హోదా విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 11 సీట్ల వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా, ఇవ్వరా, సభలో జగన్ ని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారా లేదా అనేది సందిగ్ధంలో పడింది. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రమాణ స్వీకారాల విషయంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిందని, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించబోతోందని జగన్, స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే టీడీపీ మాత్రం హోదా ఇస్తారా, ఇవ్వరా అనే అంశాన్ని సూటిగా చెప్పడంలేదు. గతంలో జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలే తమ జవాబు అని సింపుల్ గా ఆ వ్యవహారాన్ని పక్కనపెట్టింది. గతంలో చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసే అవకాశం తనకు ఉందన్నారు జగన్. ఇప్పుడు ఆ వీడియోకి బదులేది అంటే మాత్రం వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు.
నాగేశ్వర్ మార్క్ విశ్లేషణ..
తెలుగు రాజకీయాలపై టీవీ చర్చల్లో ప్రముఖంగా కనిపించే ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మార్కు విశ్లేషణ కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. సీట్లతో సంబంధం లేకుండా వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటున్నారాయన. అయితే ఇదే నాగేశ్వర్ గతంలో చంద్రబాబు ప్రతిపక్ష హోదా విషయంలో భిన్నంగా మాట్లాడారు. అంటే గతంలో తాము స్వయంగా చేసిన వ్యాఖ్యల్ని పరిస్థితులు తారుమారయ్యే సరికి నేతలు కానీ, విశ్లేషకులు కానీ మరచిపోవడం విశేషం. టీడీపీ నేతల వైఖరి చూస్తే ప్రతిపక్ష హోదాకోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా దక్కుతుంది, సభలో ముందు వరుసలో సీటు, శాసనసభ ప్రాంగణంలో ఒక గది, సెక్రటరీ, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీకి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రాధాన్యం ఉంటుంది. ఇవన్నీ అధికారికంగా ఉండేవి, కానీ అధికార పక్షం పూర్తి డామినేషన్ ఉన్నప్పుడు, స్పీకర్ ఫైర్ బ్రాండ్ అయినప్పుడు ప్రతిపక్షం సభలో ఉన్నా, లేనట్టే. ఇక ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే అధికార పార్టీ డామినేషన్ ని తట్టుకోవడం కష్టం. అందుకే జగన్ హోదా అయినా ఇవ్వాలని అడుగుతున్నారు, మీ డైలాగ్ మీరే ఓసారి వినండి అంటూ టీడీపీ ఆయనపై రివర్స్ అటాక్ చేస్తోంది.