చేతులెత్తేసిన లూథ్రా... టీడీపీలో అయోమయం

లూథ్రా ట్వీట్ దెబ్బకు తమ్ముళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. లూథ్రా ట్వీట్‌కు అర్థ‌మేంటో తెలియ‌క అందరిలో అయోమయం పెరిగిపోతోంది.

Advertisement
Update:2023-09-14 12:45 IST

దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరైన‌ సిద్దార్థ‌ లూథ్రా చేతులెత్తేశారు. లూథ్రా చేసిన పనికి చంద్రబాబునాయుడుతో పాటు మొత్తం టీడీపీ నేతలకు షాక్ కొట్టినట్లయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే లూథ్రా తాజాగా ఒక ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే ‘అన్నీ విధాలుగా ప్రయత్నించినపుడు, ఇక న్యాయం కనుచూపుమేరలో లేదని తెలిసినపుడు కత్తి తీసి పోరాటం చేయటమే సరైనది’ అన్న గురుగోవింద్ వ్యాఖ్యను ప్రస్తావించారు. దీనికి ట్యాగ్ లైన్ గా ‘ఇదే ఈ రోజు మా నినాదం’ అని చెప్పారు.

లూథ్రా ట్వీట్ దెబ్బకు తమ్ముళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. లూథ్రా ట్వీట్‌కు అర్థ‌మేంటో తెలియ‌క అందరిలో అయోమయం పెరిగిపోతోంది. న్యాయం కనుచూపుమేరలో లేదని తెలిసినపుడు అంటే అర్థ‌మేంటి? రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి చంద్రబాబునాయుడు ఇపుడప్పుడే బయటపడే అవకాశం లేదని లూథ్రా చెప్పినట్లేనా? కత్తి తీసి పోరాటం చేయటమే సరైనది అంటే దీని అర్థ‌మేంటో తెలియ‌క‌ తమ్ముళ్ళు బుర్రలు గోక్కుంటున్నారు.

కత్తి తీసి పోరాడటం అంటే ఎవరి మీద కత్తి దూయాలి? ఎవరి మీద పోరాటం చేయాలి? వాదనల ద్వారా చంద్రబాబును బయటకు తీసుకురాలేనపుడు తమ్ముళ్ళందరూ కలిసి న్యాయ వ్యవస్థ‌ మీద లేకపోతే జైలు మీద దాడి చేయాన్నది లూథ్రా ఉద్దేశ‌మా? ఇదే ఈ రోజు మా నినాదం అంటే ఇలాంటి నినాదాలిచ్చి లూథ్రా చంద్రబాబు, టీడీపీని ఏమి చేయదలిచారు? ఇలాంటి ట్వీట్ చేయటం ద్వారా లూథ్రా తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారా? లేకపోతే అంగీకరించారా? అన్నదే అర్థంకావటంలేదు.

లూథ్రా చేతులెత్తేస్తే చంద్రబాబును ఎవరు జైలు నుండి బెయిల్‌పై తీసుకురాగలరు? చంద్రబాబు మద్దతుదారుడు, న్యాయనిపుణులు జడ శ్రవణ్ కుమార్ ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ.. 6 నెలల వరకు చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చే అవకాశం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు మీద పీటీ వారెంట్ (ప్రిసనర్ ట్రాన్సిట్) జారీచేశారంటే ఇప్పుడప్పుడే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశాలు లేవని శ్రవణ్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరి అభిప్రాయాలు చూసిన తర్వాత చంద్రబాబు ఇప‌ట్లో జైల్లో నుండి బయటపడతారా అన్న‌ అనుమానం క‌లుగుతోంది.

Tags:    
Advertisement

Similar News