న్యాయరాజధాని విషయంలో కీలక ముందడుగు

కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం లా యూనివర్శిటీ నిర్మాణాలు మొదలు పెడుతుండటంతో ఆ దిశగా మరో ముందడుగు వేసినట్టయింది.

Advertisement
Update:2024-03-14 08:04 IST

ఏపీకి న్యాయ రాజధానిగా అవతరించబోతున్న కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటుకి రంగం సిద్ధమైంది. కర్నూలులో నేడు కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. దేశంలో మొత్తం 28 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ ఇందులో ఒకటి. ఇప్పుడు దేశంలో 29వ లా యూనివర్శిటీ కర్నూలులో ఏర్పాటు కాబోతోంది. కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం లా యూనివర్శిటీ నిర్మాణాలు మొదలు పెడుతుండటంతో ఆ దిశగా మరో ముందడుగు వేసినట్టయింది.

లా యూనివర్శిటీ భవన నిర్మాణాలకు సీఎం జగన్‌ ఈరోజు భూమి పూజ చేస్తారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై విశ్వ విద్యాలయ ఏర్పాటుకి 150 ఎకరాలను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది. భవన నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభమవుతాయి. ఇందులో యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. న్యాయ విద్యలో పీహెచ్‌డీ, ఫెలోషిప్‌కు కూడా అవకాశం ఉంటుంది.

వాస్తవానికి మూడు రాజధానుల గురించి వైసీపీ ప్రభుత్వం ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆలోచన బాగానే ఉన్నా.. ఆచరణలో ఇప్పటి వరకు పెద్దగా సాధించిందేమీ లేదు. విశాఖలో రుషికొండపై పర్యాటక భవనాల పేరుతో కొన్ని నిర్మాణాలయినా పూర్తయ్యాయి. కానీ న్యాయ రాజధానిగా చెప్పుకుంటున్న కర్నూలులో ఎలాంటి పనులు మొదలు కాలేదనే చెప్పాలి. సరిగ్గా ఎన్నికల వేళ లా యూనివర్శిటీ భవనాలకు భూమిపూజ చేసి కర్నూలుని న్యాయరాజధానిగా మార్చేశామని చెబితే దానివల్ల ఏమేరకు రాజకీయ ప్రయోజనం ఉంటుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News