ఆ పని మాత్రం చేయొద్దు.. జగన్ కు కేవీపీ సలహా

తాజాగా ఆయన ఓ లేఖతో ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కారు. సీఎం జగన్ కి బహిరంగ లేఖ రాశారు కేవీపీ రామచంద్రరావు.

Advertisement
Update:2023-03-15 09:18 IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న కేవీపీ రామచంద్రరావు, జగన్ వైపు మాత్రం ఎందుకో రాలేదు. అప్పుడప్పుడు ఆయన కాంగ్రెస్ కి అనుకూలంగా మాట్లాడినా, జగన్ ని ఎప్పుడూ నేరుగా విమర్శించలేదు, అలాగని పూర్తిగా సమర్థించనూ లేదు. తాజాగా ఆయన ఓ లేఖతో ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కారు. సీఎం జగన్ కి ఓ బహిరంగ లేఖ రాశారు కేవీపీ రామచంద్రరావు. పోలవరం ఎత్తు విషయంలో రాజీపడొద్దని సూచించారు.

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వడంతోపాటు, దాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రమే తీసుకోవాలి. కానీ చంద్రబాబు నిర్మాణ బాధ్యత తలకెత్తుకుని, నిధులు కేంద్రం నుంచి తీసుకోవాలనుకున్నారు. అక్కడే సీన్ రివర్స్ అయింది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది, పోలవరం ఆలస్యమైంది. టీడీపీ కూడా డెడ్ లైన్లు పెట్టింది కానీ, మరీ వైసీపీ లాగా సవాళ్లు విసరలేదు. ఇదిగో కట్టేస్తాం, అదిగో కట్టేస్తామంటూ వైసీపీ తాజా మంత్రి, మాజీ మంత్రి సవాళ్లు విసిరి ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

పోలవరం నిర్మాణం పూర్తి కావాలంటే కేంద్రం కనికరించాల్సిందే. అయితే ఇప్పుడు నిర్మాణ భారం తగ్గించుకునేందుకు కేంద్రం కొత్త మెలిక పెడుతోందనే పుకార్లు వినపడుతున్నాయి. రిజర్వాయర్ ఎత్తుని 140 అడుగులకు తగ్గిస్తే రిహాబిలిటేషన్ ప్యాకేజీ కూడా తగ్గుతుందని, నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముందని, అందుకే కేంద్రం మధ్యే మార్గాన్ని ప్రతిపాదించిందని అంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తీరని అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు కేవీపీ రామచంద్రరావు. కేంద్రంతో రాజీ పడొద్దని, అలా రాజీ పడితే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లేనని పేర్కొంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం చేతిలో ఉంది కాబట్టి.. కేంద్రం ప్రతిపాదనలను అంగీకరించొద్దని సూచించారు. ఎత్తు తగ్గించడానికి కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను చూపించినా అంగీకరించొద్దని కోరారు. పోలవరాన్ని పూర్తిస్థాయిలో త్వరితగతిన నిర్మించి రాష్ట్ర ప్రజలకు అందించడానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నానని తన లేఖలో పేర్కొన్నారు.

పోలవరం పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలని, రాష్ట్రంపై వేయకూడదంటూ 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేవీపీ. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్‌ దాఖలు కాకపోవడంతో ఆ పిటిషన్ ఇంకా పెండింగ్‌ లోనే ఉందని గుర్తు చేశారు. ఏపీ పునర్ వ్యవవస్థీకరణ చట్టం సెక్షన్‌-90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చు బాధ్యత కేంద్రానిదేనన్నారు. కేంద్రం ఒత్తిడికి తలొంచొద్దని జగన్ కి సూచించారు కేవీపీ.

Tags:    
Advertisement

Similar News