కర్రల సమరంలో విషాదం.. ఒకరు మృతి..

ఇటీవల పోలీసులు నిఘా పెడుతున్నారు. ఇనుప మేకులు ఉండే కర్రలను స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ అక్కడ తలలు పగలడం ఆగలేదు. ఈఏడాది ఒకరు మృతి చెందడం మరింత విషాదం.

Advertisement
Update:2022-10-06 07:57 IST

కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో ప్రతి ఏటా నిర్వహించే బన్నీ ఉత్సవంలో ఈసారి కూడా రక్తం ఏరులై పారింది. అయితే ఈ ఏడాది విషాద ఘటన చోటు చేసుకుంది. బన్నీ ఉత్సవంలో పాల్గొన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో అతడు మృతి చెందినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ మరణాన్ని ధృవీకరించలేదు. అయితే బన్నీ ఉత్సవానికి తరలి వస్తున్న క్రమంలో ఓ బాలుడు మృతి చెందాడని మాత్రం పోలీసులు చెబుతున్నారు. కర్నాటక లోని శిరుగుప్ప ప్రాంతానికి చెందిన బాలుడు దేవరగట్టుకి వచ్చే క్రమంలో గుండెపోటుతో చనిపోయాడని అంటున్నారు.

80మందికి పైగా గాయాలు..

దేవరగట్టులో మాల మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా జరిగే కర్రల సమరం ఈ ఏడాది వర్షం కారణంగా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా ఇక్కడ చాలామందికి దెబ్బలు తగులుతుంటాయి. పోలీసుల పహారా ఉన్నా కర్రల సమరం జరగాల్సిందే. ఈ ఏడాది కర్రల సమరంలో 80మందికి పైగా గాయలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ఎందుకీ రక్త తర్పణం..?

దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తయిన కొండపై మాల మల్లేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. దసరా రోజున బన్నీ ఉత్సవం చేస్తారు. మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్‌, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. స్వామిని ఏ గ్రామాలకు తరలిస్తే వారికి ఆ ఏడాది మంచి జరుగుతుందని, పంటలతో ఆయా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని నమ్మకం. అందుకే దసరా రోజు తలలు పగులుతున్నా స్వామివారు తమ ఊరికే రావాలని కోరుకుంటారు భక్తులు. ఇటీవల పోలీసులు నిఘా పెడుతున్నారు. ఇనుప మేకులు ఉండే కర్రలను స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ అక్కడ తలలు పగలడం ఆగలేదు. ఈఏడాది ఒకరు మృతి చెందడం మరింత విషాదం.

Advertisement

Similar News