కొత్తపల్లి సుబ్బారాయుడికి చివరికి ఆ పార్టీనే దిక్కా?

తెలుగుదేశం పార్టీ సుబ్బారాయుడి చేరికపై అంత ఆసక్తి చూపించడం లేదు. పలు మార్లు పార్టీలు మారిన ఆయన పట్ల చంద్రబాబు కూడా సానుకూలంగా లేరని తెలుస్తున్నది.

Advertisement
Update:2022-11-22 08:39 IST

ఏపీలోని నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఐదు సార్లు గెలిచిన కొత్తపల్లి సుబ్బారాయుడు.. ఇప్పుడు ఏ పార్టీలో చేరాలా అనే సందిగ్దంలో ఉన్నారు. ఏ పార్టీలో చేరాలా అని ఆలోచిస్తున్నారు అనే కంటే.. తనకు ఏ పార్టీ 2024లో టికెట్ కేటాయిస్తుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. నర్సాపురం వైసీపీలో తీవ్ర విభేదాలకు కారణమవుతున్నారనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే మదునూరి ప్రసాద్ రాజుతో నిత్యం ఘర్షణలు పడుతూ, బహిరంగంగానే ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సుబ్బారాయుడిని వైసీపీ నుంచి బహిష్కరించారు.

ఇక ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. తెలుగుదేశం పార్టీ ఆయన చేరికపై అంత ఆసక్తి చూపించడం లేదు. పలు మార్లు పార్టీలు మారిన ఆయన పట్ల చంద్రబాబు కూడా సానుకూలంగా లేరని తెలుస్తున్నది. మొదట్లో టీడీపీ నుంచే గెలిచిన సుబ్బారాయుడు.. ఆ తర్వాత పీఆర్పీ టికెట్‌పై 2009లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2012 ఉపఎన్నికలో గెలుపొందారు. 2014లో వైసీపీ టికెట్‌పై పై పోటీ చేసి ఓడిపోయారు. 1983 నుంచి వరుసగా పోటీ చేస్తూ వస్తున్న సుబ్బారాయుడు.. 2019లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన మదునూరి ప్రసాద్ రాజుతో మొదటి నుంచి విభేదిస్తూ వచ్చారు.

కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో వైసీపీ నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజుతో తీవ్రంగా విభేదించారు. అఖిలపక్షం నిర్వహించిన ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఏకంగా రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతడిని గెలిపించి తప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్నారు. ఇది వైసీపీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మొదట గన్‌మెన్లను తొలగించిన ప్రభుత్వం.. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించింది.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తనకు ఛాన్స్ లేదని సుబ్బారాయుడు గ్రహించారు. సుబ్బారాయుడు తరుచూ పార్టీలు మారుతుండటంతో టీడీపీ బండారు మాధవనాయుడిని ప్రోత్సహించింది. 2014లో మాధవనాయుడే టీడీపీ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నది. చంద్రబాబు ఆయన గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు. సుబ్బారాయుడిని మళ్లీ తీసుకొని వచ్చి పార్టీలో లుకలుకలకు ఆజ్యం పోయాలని భావించడం లేదు.

ప్రస్తుతం సుబ్బారాయుడు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో ప్రజారాజ్యంలో పని చేసినప్పుడు పవన్ కల్యాణ్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. నాగబాబుతో కూడా సుబ్బారాయుడికి సాన్నిహిత్యం ఉన్నది. దీంతో ఈ సారి జనసేన తరపున పార్టీ టికెట్ తెచ్చుకొని తిరిగి ఎమ్మెల్యే కావాలని బావిస్తున్నారు. నర్సాపురం నుంచే తాను పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీనో ఇప్పుడే చెప్పనని తాజాగా సుబ్బారాయుడు కామెంట్లు చేశారు. అనుచరులు అందరూ సిద్ధంగా ఉండాలని.. ఈ సారి తన గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు. జనసేన నుంచి సుబ్బారాయుడికి గ్రీన్ సిగ్నల్ వచ్చినందునే.. సుబ్బారాయుడు ఆ వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతున్నది. మొత్తానికి ఉన్న ప్రధాన పార్టీలన్నీ తిరిగిన సుబ్బారాయుడు చివరకు జనసేన పంచన చేరుతారనే చర్చ నర్సాపురంలో జరుగుతున్నది.

Tags:    
Advertisement

Similar News