వివేకా కేసులో కీలక పరిణామాలు
పిటిషన్ విచారణ మొదలవ్వగానే అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తున్నది ఎవరు అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు. అందుకు పిటిషన్ల తరపు న్యాయవాదులు సహ నిందితులేనని సమాధానం ఇచ్చారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దస్తగిరి కీలక వ్యక్తిగా మారారు. అతడు అప్రూవర్‌గా మారడంతో సీబీఐకి ఈ కేసు దర్యాప్తులో సీబీఐ ముందుకెళ్లే అవకాశం ఏర్పడింది. అయితే దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా అనుమతిస్తారంటూ ఇదే కేసులో కీలక నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయించారు.
ఇప్పటికే వారికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని హైకోర్టు సమర్ధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు నిందితులు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ తగిలింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అవకాశం కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అసలు కేసులో కీలక నిందితులుగా ఉన్న శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు దస్తగిరి అప్రూవర్‌గా మారకూడదని అడ్డుచెప్పడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పిటిషన్ విచారణ మొదలవ్వగానే అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తున్నది ఎవరు అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు. అందుకు పిటిషన్ల తరపు న్యాయవాదులు సహ నిందితులేనని సమాధానం ఇచ్చారు. అందుకు స్పందించిన కోర్టు.. దస్తగిరి అప్రూవర్‌గా మారడంపై హతుడు వివేకా కుమార్తె సునీతారెడ్డికి, దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేనప్పుడు నిందితులెందుకు అభ్యంతరం తెలుపుతున్నారని ప్రశ్నించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారినా ఆయన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఎలాగో ఉంటుంది కాదా అని ప్రశ్నించింది.
ఈకేసులో పోరాటం చేస్తున్న వైఎస్ సునీతారెడ్డి చురుగ్గానే వ్యవహరిస్తున్నారని.. ఒకవేళ ఈ కేసులో పరిణామాలను ఆమె సవాల్ చేస్తే అప్పుడు పరిశీలన చేద్దామని.. అంతేకానీ నిందితులే అభ్యంతరాలు తెలపడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలకు వచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని సవాల్ చేస్తూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
నా గన్‌మెన్లను మార్చారు- దస్తగిరి
అటు కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరోసారి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తనకున్న గన్‌మెన్లను హఠాత్తుగా మార్చేశారని, ఒకవేళ తనకు ఏమైనా అయితే అందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. కడప ఎస్పీని కలిసి గన్‌మెన్ల మార్పుపై ఫిర్యాదు చేశారు. కేసులో సాక్షిగా ఉన్న తనకు భద్రత కల్పించాల్సిందిపోయి గన్‌మెన్లను మార్చడం ద్వారా ప్రభుత్వం తనను ఏం చేయాలనుకుంటోందో తెలియడం లేదన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వరుసగా కేసులు కూడా పెడుతున్నారని ఆరోపించారు. తనకు కొత్తగా కేటాయించిన గన్‌మెన్ల వ్యవహారశైలిపై తనకు అనుమానాలున్నాయని చెప్పారు.
దస్తగిరి ఆరోపణలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ తోసిపుచ్చారు. గన్‌మెన్ల మార్పు కేవలం పరిపాలన పరమైనదేనని అంతకు మించి ఏమీ లేదన్నారు.తొండూరు గ్రామంలో దస్తగిరికి, ఇతరులకు మధ్య ఘర్షణ జరిగిందని.. ఆ సమయంలో ఇది వరకు ఉన్న గన్‌మెన్లు సరిగా వ్యవహరించలేదని అందుకే వారిని మార్చామని ఎస్పీ వివరణ ఇచ్చారు.