ముందస్తుపై జగన్ కీలక వ్యాఖ్యలు
ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో ఉంటాయని ఆలోపు అందరూ కష్టపడి పని చేస్తే గెలుపు ఈజీ అవుతుందని జగన్ వ్యాఖ్యానించారు. మీరంతా ఈ తొమ్మిది నెలల పాటు కష్టపడండి గెలుపు ఎలా రాదో నేను చూస్తా అంటూ మంత్రులతో జగన్ చెప్పారు.
ఎన్నికలు రాబోతున్నాయి.. మన పోరాటం ఫలించబోతోంది.. చాలా దగ్గరకు వచ్చేశాం అంటూ ఒకవైపు టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఉత్సాహాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. పాలన జగన్ కు భారంగా మారిందని కాబట్టి తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్తారు అంటూ కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచారం చేస్తూ వచ్చాయి. అయితే ముందస్తు ముచ్చటే లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేబినెట్ సమావేశంలో మంత్రులకు ఈ విషయాన్ని జగన్ స్పష్టం చేశారు. ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారమే వెళ్తామని వెల్లడించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదన్నారు. ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో ఉంటాయని ఆలోపు అందరూ కష్టపడి పని చేస్తే గెలుపు ఈజీ అవుతుందని జగన్ వ్యాఖ్యానించారు. మీరంతా ఈ తొమ్మిది నెలల పాటు కష్టపడండి గెలుపు ఎలా రాదో నేను చూస్తా అంటూ మంత్రులతో జగన్ చెప్పారు.
చాలా భారంగా కాలాన్ని వెలదీస్తున్న చంద్రబాబు నాయుడు గానీ, టీడీపీ శ్రేణులు గానీ ముందస్తు మాటలు వినిపించిన ప్రతిసారి కాస్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ భారాన్ని మోయడం కంటే ఎన్నికలు వస్తే ఏదో ఒకటి తేల్చుకుని వెళ్లిపోవడం మంచిదన్నట్టుగా టీడీపీ వైఖరి ఉంది. ఇప్పుడు జగన్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తాం, ముందస్తు ముచ్చటే లేదని తేల్చి చెప్పడం టీడీపీ శ్రేణులకు నిరుత్సాహాన్ని కలిగించే అంశమే.. ఇంకా 9 నెలలా అన్న భావన టీడీపీ శ్రేణుల్లో కనిపించవచ్చు.