నేను బాబు చిట్టా విప్పితే.. మీరు తట్టుకోలేరు
అంబేడ్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారని, సీఎం జగన్ మాత్రం రాష్ట్రం నడిబొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారని కేశినేని నాని ఈ సందర్భంగా కొనియాడారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు స్ఫూర్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. వివక్ష లేని సమాజం కావాలని అంబేడ్కర్ ఆశించారని, ఇప్పుడు సీఎం జగన్ వివక్ష లేని పాలన అందిస్తున్నారని గుర్తుచేశారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, అది సమంజసం కాదని ఆయన చెప్పారు. తాను చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరంటూ టీడీపీ నేతలను హెచ్చరించారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారని, సీఎం జగన్ మాత్రం రాష్ట్రం నడిబొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారని కేశినేని నాని ఈ సందర్భంగా కొనియాడారు. వైఎస్ జగన్ కలలకు రూపం ఈ అంబేద్కర్ విగ్రహమని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఆరోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారని ఆయన వివరించారు. అంటరానితనం, కుల వివక్షపైన అంబేడ్కర్ పోరాటం చేశారని, పేదలను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్ అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని స్పందించారు. ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రేపు ఎన్నికల బాక్సులు తెరిచిన తర్వాత ఏ పార్టీ 80 శాతం ఖాళీ అవుతుందో తెలుస్తుందంటూ ఎద్దేవా చేశారు.