చంద్రబాబు, పవన్‌కు కేసీఆర్‌ షాకివ్వబోతున్నారా?

కేవలం నేతలను ఆకర్షించటం వల్ల ఉపయోగంలేదని కాపు సామాజికవర్గం మొత్తాన్ని బీఆర్ఎస్ వైపు లాక్కోవాలని కేసీఆర్‌ ప్లాన్ వేశార‌ట‌. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే కాపులకే ముఖ్యమంత్రి పదవి అని ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Advertisement
Update:2023-01-26 11:24 IST

చంద్రబాబు, పవన్‌కు కేసీఆర్‌ షాకివ్వబోతున్నారా?

కాపు ప్రముఖుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఈమధ్యనే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ నాయకత్వంలో ఏపీలోని కాపు ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే.


పార్టీలకు అతీతంగా గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇంకా చాలామంది హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్నవారి నుండి అందిన సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లను కొల్లగొట్టేందుకు కేసీఆర్‌ పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే వివిధ పార్టీల్లోని కాపు ప్రముఖులను బీఆర్ఎస్‌లోకి రప్పించే బాధ్య‌తలను తోట మీద కేసీఆర్‌ పెట్టారట. అయితే కేవలం నేతలను ఆకర్షించటం వల్ల ఉపయోగంలేదని కాపు సామాజికవర్గం మొత్తాన్ని బీఆర్ఎస్ వైపు లాక్కోవాలని కేసీఆర్‌ ప్లాన్ వేశార‌ట‌.


ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే కాపులకే ముఖ్యమంత్రి పదవి అని ప్రకటించబోతున్నట్లు సమాచారం. కాపులకు రాజ్యాధికారం కావాలనే డిమాండ్ కాపు ప్రముఖులతో పాటు సామాజికవర్గంలో బలంగా వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్‌ తనతో చెప్పిన విషయాన్నే కాపు ప్రముఖుల సమావేశంలో తోట వివరించారట.

అయితే కాపుల డిమాండ్‌ను ఏ పార్టీ కూడా పట్టించుకునే అవకాశం లేదు. సరిగ్గా ఇక్కడే కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. మొదటిసారి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్ కాపులను ఆకర్షించాలంటే ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని హామీ ఇవ్వటమే మార్గమని డిసైడ్ అయ్యారట. ఓటింగ్ పర్సంటేజ్ రీత్యా తీసుకుంటే కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీలు దాదాపు శూన్యమనే చెప్పాలి. వీటికన్నా కాస్త మెరుగైన స్ధితిలో జనసేన ఉంది.

టీడీపీతో పొత్తు పెట్టుకోవటానికి రెడీ అవుతున్న పవన్ అంటే కాపుల్లో వ్యతిరేకత మొదలైపోయిందట. పవన్ కారణంగా చంద్రబాబు పల్లకీని తామెందుకు మోయాలనే చర్చలు కాపుల్లో మొదలైంది. పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే టీడీపీ-జనసేనకు కాపుల మద్దతుంటుందని హరిరామజోగయ్య కండీషన్ పెట్టారు.


ఈ నేపథ్యంలోనే కాపులకు సీఎం పదవిని ప్రకటించటం ద్వారా ఒకేసారి చంద్రబాబు, పవన్‌కు షాకివ్వచ్చని కేసీఆర్‌ భారీ స్కెచ్ వేస్తున్నారని సమాచారం. ఏపీలో తొందరలో జరగబోయే బహిరంగసభలో ఈ విషయాన్ని కేసీఆర్‌ ప్రకటించబోతున్నట్లు సమాచారం. చూద్దాం చివరకు ఏమవుతుందో.

Tags:    
Advertisement

Similar News