ఏపీలో జై కేసీఆర్.. ఇదెక్కడి మాస్ ఫాలోయింగ్..

ఇంట గెలిచి, ర‌చ్చ గెలవాల‌న్న రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన త‌ర్వాతే, కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ ని ఏర్పాటు చేశారని చెప్పారు రమణరాజు.

Advertisement
Update:2022-10-09 16:06 IST

తెలంగాణలో కేసీఆర్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సంగతి పక్కనపెడితే సామాన్య ప్రజల్లో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వీరాభిమానులు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఉన్నారు. ఆమధ్య బీఆర్ఎస్ ప్రకటన సమయంలో ఏపీలో వెలసిన బ్యానర్లు, పోస్టర్లే దీనికి నిదర్శనం.

ఏపీలో బీఆర్ఎస్ టికెట్ల కోసం పోటీ నెలకొందనే విషయం వాస్తవం. పోటీ ఉంది కాబట్టే, ముందుగా కొంతమంది నేతలు కర్చీఫ్ వేసుకుంటున్నారు. ఫలానా నియోజకవ‌ర్గ‌ బీఆర్ఎస్ అభ్యర్థి అంటూ పేర్లు ప్రకటించుకుంటున్నారు, బ్యానర్లు వేసుకుంటున్నారు. పార్టీకోసమే కాదు, వ్యక్తిగతంగా కేసీఆర్ పేరుతో కూడా సంఘాలు, సమితిలు ఏర్పాటవుతున్నాయి. తాజాగా కేసీఆర్ ఫౌండేషన్ ఏపీలో బీఆర్ఎస్ రాజకీయాలపై స్పందించింది. ఏపీలో బీఆర్ఎస్ కి అడుగుపెట్టే హక్కు లేదంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని కేసీఆర్ ఫౌండేషన్ సభ్యులు ఖండించారు. కేసీఆర్ పై సోము వీర్రాజు చేసిన విమర్శలను తిప్పికొట్టారు.

ఆంధ్రప్రదేశ్ విభజన కోసం 1999 లోనే కాకినాడ కేంద్రంగా తీర్మానం చేసిన బీజేపీ విశృంఖల రాజకీయం న‌డిపింద‌ని విమర్శించారు కేసీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి రమణరాజు. అలాంటి బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ కి ఏపీలో అడుగు పెట్టే హక్కు లేదంటూ విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు. ఇంట గెలిచి, ర‌చ్చ గెలవాల‌న్న రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన త‌ర్వాతే, కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ ని ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణలో జ‌రిగినంత అభివృద్ధి దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జ‌రగ‌లేద‌న్నారు. ఆంధ్రాలోనే కాకుండా 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కేసీఆర్‌ కు అభిమానులున్నారని చెప్పారు రమణరాజు. 2024 సార్వత్రిక ఎన్నికలతో బీఆర్ఎస్‌ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News