కుమారుడి పోటీ సీటుపై కాసు కృష్ణారెడ్డి స్పష్టత
వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి కాసు కుటుంబం పోటీ చేయాలంటూ ఇటీవల భారీగా నరసరావుపేటలో ప్లెక్సీలు వెలిశాయి. వేలాది కరపత్రాల పంపిణీ జరిగింది.
నరసరావుపేటలో రేగిన ఫ్లెక్సీల వివాదంపై మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి స్పందించారు. కావాలనే కొందరు ఈ ఫ్లెక్సీల వివాదాన్ని రాజేశారని ఆరోపించారు. కాసు కుటుంబం నరసరావుపేట నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్నది కొందరి అభిమానుల కోరిక మాత్రమేనన్నారు.
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు కాసు మహేష్ రెడ్డి తిరిగి గురజాల నుంచే పోటీ చేస్తారని.. నరసరావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డే పోటీ చేస్తారని కృష్ణారెడ్డి చెప్పారు. ఇందులో వివాదం లేదన్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ తమ వర్గం వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకుంటే నరసరావుపేటలో ఎవరూ అడ్డుకునే పరిస్థితి ఉండదన్నారు.
వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి కాసు కుటుంబం పోటీ చేయాలంటూ ఇటీవల భారీగా నరసరావుపేటలో ప్లెక్సీలు వెలిశాయి. వేలాది కరపత్రాల పంపిణీ జరిగింది. దాంతో కాసు మహేష్ నరసరావుపేట సీటు కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో కాసు కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన ఒక శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఇది వివాదంగా మారడంతో కాసు కృష్ణారెడ్డి స్పందించారు. నరసరావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డే పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చారు.