కాపు నేతల్లో చీలికొచ్చేసిందా?
పవన్‌ను వ్యతిరేకించే కాపు నేతల్లో చాలామంది జోగయ్యను పట్టించుకోవటంలేదు. దాంతో పవన్ బాగా మండిపోతున్నారు. అందుకనే కాపు నేతలను ఏమీ అనలేక పవన్ పరోక్షంగా ముద్రగడ పద్మనాభంను కెలికేశారు.
చాలాకాలంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతల్లో చీలిక తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా కాపుల సమీకరణకు చేగొండి హరిరామజోగయ్య ప్రయత్నిస్తున్నారు. అయితే జోగయ్యను చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే జోగయ్య పవన్ మద్దతుదారుడన్న విషయం తెలిసిందే. పవన్‌ను వ్యతిరేకించే కాపు నేతల్లో చాలామంది జోగయ్యను పట్టించుకోవటంలేదు. దాంతో పవన్ బాగా మండిపోతున్నారు. అందుకనే కాపు నేతలను ఏమీ అనలేక పవన్ పరోక్షంగా ముద్రగడ పద్మనాభంను కెలికేశారు.
వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. కాపు ఉద్యమాన్ని కొందరు రాజకీయంగా పదవులు పొందేందుకు ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఉద్యమం పేరుతో కాపులను రెచ్చగొట్టారంటూ పేరు చెప్పకుండానే ముద్రగడపై ఆరోపణలు గుప్పించారు. దాంతో మండిపోయిన ముద్రగడ మంగళవారం ఉదయం పవన్‌కు బహిరంగలేఖ రాశారు. అందులో పవన్‌పై అనేక ఆరోపణలు చేశారు. ముద్రగడ లేఖ విడుదల కాగానే మధ్యాహ్నానానికి జనసైనికులు రెచ్చిపోయి ముద్రగడను బూతులు తిట్టారు.
సాయంత్రానికి ముద్రగడ లేఖకు కౌంటరుగా జోగయ్య లేఖ విడుదల చేశారు. అందులో ముద్రగడను తప్పుపడుతూ కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో ఏమైందంటే కాపు నేతల్లో చీలిక వచ్చినట్లయ్యింది. మామూలుగానే కాపుల్లో కాకినాడ కాపులు, పాలకొల్లు కాపులని రెండు వర్గాలున్నాయట. పాలకొల్లు కాపుల్లో కొందరు జోగయ్యకు మద్దతుగా ఉంటే కాకినాడ కాపుల్లో ఎక్కువ మంది ముద్రగడకు మద్దతుగా ఉన్నారు. ఇంతకాలం సమాంతర రాజకీయాలు చేసుకుంటూ ఒకరి జోలికి మరొకరు వెళ్ళకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే పవన్ పుణ్యమా అని కాపునేతలు ఇప్పుడు రోడ్డునపడ్డారు.
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు కాపుల రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసిన ముద్రగడ జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఎందుకు వదిలేశారన్నది జోగయ్య ప్రశ్న. కాపులకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చి తప్పింది చంద్రబాబే కాబట్టి తాను ఉద్యమాలు చేశానని ముద్రగడ చాలాసార్లు చెప్పారు. అయితే కాపు రిజర్వేషన్ల కోసం జగన్‌కు కూడా ముద్రగడ అనేకసార్లు లేఖలు రాశారు. పవన్+జోగయ్య ఉద్దేశంలో ముద్రగడ ఇప్పుడు కూడా ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని. అందుకు ముద్రగడ సుముఖంగా లేరు. దీంతోనే ముద్రగడంటే వీళ్ళకి మండుతోంది. మొత్తానికి గతంలో ఎప్పుడూ లేనివిధంగా పవన్+జోగయ్య-ముద్రగడ మధ్య ఫైటింగ్ మొదలైంది. ఇదెక్కడివరకు వెళుతుందో చూడాల్సిందే.