పవన్‌కు గాదె షాకిచ్చాడా?

జనసేనను అధికారంలోకి తెచ్చేంతవరకు కాపుల్లో ఎవరూ విశ్రాంతి తీసుకోకూడ‌ద‌ని మాట్లాడిన గాదె బాలాజీ బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గాదె తాజా నిర్ణయంతో కాపు ప్రముఖులతో పాటు జనసేన నేతలు కూడా ఆశ్చర్యపోయారు.

Advertisement
Update:2023-03-06 11:20 IST

ఈమధ్యనే వైజాగ్‌లో కాపునాడు ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. ఆ సభ నిర్వహణలో అంతా తానై గాదె బాలాజీ వ్యవహరించాడు. కాపులంతా ఏకతాటిపైన నిలబడాలని పిలుపిచ్చాడు. కాపులందరు కష్టపడి ఇతర సామాజికవర్గాలతో సమన్వయం చేసుకుని పవన్ కల్యాణ్ సీఎం అయ్యేందుకు కృషి చేయాలన్నాడు. జనసేనను అధికారంలోకి తెచ్చేంతవరకు కాపుల్లో ఎవరూ విశ్రాంతి తీసుకోకూడదన్నట్లుగా మాట్లాడాడు. కాపుల ఐక్యత కోసం, పవన్‌ను సీఎంగా చూడటం కోసం ఎంతకైనా తెగిస్తానని ప్రకటించారు.

సీన్ కట్ చేస్తే అదే గాదె బాలాజీ బీఆర్ఎస్‌లో చేరిపోయారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో కారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గాదె తాజా నిర్ణయంతో కాపు ప్రముఖులతో పాటు జనసేన నేతలు కూడా ఆశ్చర్యపోయారు. నిన్నటివరకు పవన్‌ను సీఎంగా చూడటమే తన ధ్యేయమని పదేపదే ప్రకటించిన గాదె ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరటం ఏమిటో అర్థంకాలేదు.

ఇంతకుముందు మహాసేన రాజేష్ కూడా సేమ్ టు సేమ్. పవన్ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పుకుని జనసేనలో చేరటానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల టీడీపీలో చేరిపోయారు. అయితే రాజేష్‌కు గాదెకు చాలా తేడావుంది. రాజేష్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తయితే గాదె కాపు నేత. కాపు సర్కిల్స్ లో గాదె బాలాజీ అందరితోనూ టచ్‌లో ఉంటారు. కాబట్టి కాపు ప్రముఖ సర్కిళ్ళల్లో అందరికీ తెలిసిన వ్యక్తి.

కాపు నేతగా ఉంటూనే బహిరంగంగా జనసేన మద్దతుదారుడిగా, పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే తన టార్గెట్ అని చెప్పుకున్న గాదె బాలాజీ హఠాత్తుగా బీఆర్ఎస్‌లో ఎందుకు చేరారనే చ‌ర్చ‌ మొదలైంది. కాపు ప్రముఖలమని చెప్పుకుంటున్న వారిలో చేగొండి హరిరామజోగయ్య తప్ప ఇంకెవ్వ‌రూ పవన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. ఇలాంటి నేపథ్యంలో గాదె మాత్రమే మద్దతు ప్రకటించటమే కాకుండా విశాఖపట్నంలో బహిరంగసభ కూడా నిర్వహించారు. ఇలాంటి కీలక మద్దతుదారుడు అయిన‌ గాదె బీఆర్ఎస్‌లో చేరటం పవన్‌కు షాక్ అనే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News