పవన్ కల్యాణ్‌కు పొంచి ఉన్న మరో ఎదురుదెబ్బ
పవన్ కల్యాణ్‌ను లోక్‌సభకు పోటీ చేయించడం కూడా చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే జరుగుతోందని ఆయన అన్నారు. అన్నయ్య చిరంజీవి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెప్పారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఎత్తుగడలకు చిత్తవుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. లోక్‌సభకు పోటీ చేసి గెలిచి వస్తే కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని బిజెపి పెద్దలు పవన్ కల్యాణ్‌కు చెప్పినట్లు సమాచారం. అందుకు పవన్ కల్యాణ్ సిద్ధపడినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే చంద్రబాబు ప్రణాళిక పక్కాగా అమలవుతుందని అంటున్నారు.
పవన్ కల్యాణ్ భవిష్యత్తులో ఎదుర్కునే ప్రమాదంపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సోమవారం ఓ లేఖ రాశారు. లోక్‌సభకు పోటీ చేయవద్దని, అలా చేస్తే శాసనసభలో కాపు ప్రాతినిధ్యం బలహీనపడుతుందని ఆయన హెచ్చరించారు. మళ్లీ రాష్ట్రంలో రెడ్లు, కమ్మ సామాజిక వర్గాల ఆధిపత్యమే కొనసాగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్‌ను లోక్‌సభకు పోటీ చేయించడం కూడా చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే జరుగుతోందని ఆయన అన్నారు. అన్నయ్య చిరంజీవి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆయన మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చేరారు. కాపులు వెనక బెంచీకి వెళ్లిపోయారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రివర్గంలో చేరితే కాపుల పరిస్థితి అదే అవుతుందని అంటున్నారు.
నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో కలిపేసుకుంటారని, జనసేనను టీడీపీలో విలీనం చేసుకునే నాటకం ఆడుతారని హరిరామ జోగయ్య అన్నారు. ఈ స్థితిలో పవన్ కల్యాణ్ కేంద్రానికి వెళ్లకూడదని ఆయన సూచన.