అప్పుడే కన్నాకు వంటబట్టేసిందా?

సీఐడీ అంటే జగన్ జేబు సంస్థ‌గా కన్నాలక్ష్మీనారాయణ ఆరోపించారు. మరి ఈడీ, జీఎస్టీలను నరేంద్రమోడీ జేబు సంస్థ‌ల‌ని ఆరోపించగలరా? ఏదో విధంగా జగన్‌పై బురదచల్లేయాలన్న ఆలోచ‌నే కన్నాలో కనబడుతోంది.

Advertisement
Update:2023-03-11 11:08 IST

చేరి పది రోజులు అయ్యిందో లేదో అప్పుడే కన్నా లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ లక్షణాలన్నీ బాగా వంటబట్టేసినట్లు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్‌ కుంభకోణం పేరుతో జగన్మోహన్ రెడ్డి అందరినీ వేధింపులకు గురిచేస్తున్నట్లు రెచ్చిపోయారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేయటం అన్యాయమట. సీఐడీని జగన్ తన జేబు సంస్థ‌గా మార్చుకుని ప్రత్యర్థులను, నిజాయితి కలిగిన అధికారులను వేధింపులకు గురిచేయటం తగదని మండిపడ్డారు. సెంటర్లో అసలు అవినీతన్నదే జరగలేదని కన్నా తేల్చేయటమే విచిత్రంగా ఉంది.

స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ ముసుగులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని దర్యాప్తు సంస్థ‌లు ఇప్పటికే తేల్చాయి. అవినీతిని బయటపెట్టేందుకు సీఐడీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే చాలా మందిని విచారించాయి, కొందరిని అరెస్ట్‌ కూడా చేశాయి. రూ.370 కోట్ల అవినీతి జరిగిందని ఇప్పటికే లెక్కలు తేల్చాయి. అవినీతి ఎలా జరిగింది? ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఏ మార్గాల్లో చేరిందనే విషయాలపైనే దర్యాప్తు చేస్తున్నాయి.

సెంటర్ ముసుగులో హవాలా, మ‌నీ ల్యాండ‌రింగ్ పెద్దఎత్తున జరిగిందని ఇప్పటికే ఈడీ నిర్ధారణకు వచ్చింది. తొందరలోనే కుంభకోణం పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్ సంస్థ చెప్పింది. అలాగే చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే తాము నడుచుకున్నట్లు అప్పటి అధికారులు అంగీకరించారట. ఎలా చూసినా కుంభకోణానికి సూత్రదారి చంద్రబాబే అనే ప్రచారం పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలోనే కన్నా, బోండా తదితరులు పదే పదే మీడియా ముందుకొచ్చి అసలు కుంభకోణమే జరగలేదంటు గోల మొదలుపెట్టారు. కుంభకోణం జరిగిందా లేదా అని దర్యాప్తు సంస్ధలు తేల్చుతాయి. సీఐడీ అంటే జగన్ జేబు సంస్థ‌గా కన్నా ఆరోపించారు. మరి ఈడీ, జీఎస్టీలను నరేంద్రమోడీ జేబు సంస్థ‌ల‌ని ఆరోపించగలరా? మళ్ళీ ఆ మాటనే ధైర్యంలేదు. విచారణ ముందుకు సాగకూడదు, జగన్‌పై బురదచల్లేయాలన్న టార్గెట్ మాత్రమే కన్నాలో కనబడుతోంది. మొత్తానికి కన్నాకు టీడీపీ సిలబస్ బాగానే వంటపట్టేసినట్లుంది.

Tags:    
Advertisement

Similar News