తెలుగుదేశంలో `కళా`విహీనం.. వారసుడే శాపం
మంచి అవకాశాలు ఒకేసారి దక్కించుకున్న కళావెంకటరావు తన తనయుడు రామ్ మల్లిక్ నాయుడుని రాజకీయాలకు పరిచయం చేయడంలో దారుణంగా విఫలమయ్యారు.
తెలుగుదేశంలో ఒకప్పుడు కళకళలాడిన ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం కిమిడి కళావెంకటరావు ఇప్పుడు కళా విహీనమవుతూ వస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే దశాబ్దాల రాజకీయ జీవితానికి తెరపడినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేతలందరూ, ఇప్పుడు తమ వారసులని రాజకీయాలకు పరిచయం చేసి తాము తప్పుకోవాలనుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు తమ వారసుల్ని పరిచయం చేసి మెల్లగా రాజకీయ యవనిక నుంచి తప్పుకుంటున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన కిమిడి కళా వెంకటరావు 2014-19 మధ్యలో టీడీపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అందరిలాగే తాను తనయుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడుకి రాజకీయ వారసత్వం కట్టబెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అధిష్టానం నుంచి మాత్రం ఎటువంటి సంకేతాలు రాకపోయేసరికి కళాలో ఆందోళన పెరుగుతోంది.
నియోజకవర్గాల పునర్విభజనకు ముందు తన స్వగ్రామం ఉన్న నియోజకవర్గం ఉణుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేవారు. రాజ్యసభకి వెళ్లిన సమయంలో ఉణుకూరు నుంచి తమ్ముడు గణపతిరావుని నిలబెట్టి గెలిపించుకున్నారు. అనంతరకాలంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఉణుకూరు మాయమై, రాజాం నియోజకవర్గం (ఎస్సీ రిజర్వుడు) వచ్చింది. దీంతో కళా వెంకటరావుకి నియోజకవర్గమే లేని పరిస్థితి. పునర్విభజన సమయంలో ఎస్సీ రిజర్వుడుగా ఉన్న ఎచ్చెర్ల జనరల్ కావడంతో కిమిడి కళా వెంకటరావు ఎచ్చెర్లకి తన రాజకీయ కేంద్రంగా చేసుకున్నారు.
ప్రజారాజ్యంలో చేరి దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. మళ్లీ టీడీపీ గూటికి చేరి ఎచ్చెర్ల నుంచి గెలవడమే కాకుండా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడయ్యారు.
ఇన్ని మంచి అవకాశాలు ఒకేసారి దక్కించుకున్న కళావెంకటరావు తన తనయుడు రామ్ మల్లిక్ నాయుడుని రాజకీయాలకు పరిచయం చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, కమీషన్లు తీసుకోవడంలో చేయి తిరిగిన కొడుకుకి కేడర్, లీడర్లని మెప్పించే కళ నేర్పించలేకపోయారు కళా వెంకటరావు. అధికారం అనుభవించడమే కానీ, నిలబెట్టుకునే తెలివితేటలు లేని తనయుడు కళా గుండెలపై కుంపటిలా మారాడు. చంద్రబాబు, లోకేష్‌ల దగ్గర పలుకుబడి ఉన్న కళావెంకటరావు.. వాక్చాతుర్యం లేని, కేడర్‌ని కలుపుకెళ్లలేని తన కొడుకు గురించి ప్రస్తావించలేక మథనపడిపోతున్నాడు.
ఎచ్చెర్ల టికెట్ తనకివ్వాలని, లేదంటే తనయుడు రామ్ మల్లిక్ నాయుడుకి ఇవ్వాలని పట్టుబడుతున్న కళా వెంకటరావు డిమాండ్లని అధిష్టానం పట్టించుకున్న దాఖలాలు లేవు. విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చి కళావెంకటరావుని బరిలోకి దింపుతారనే మరో ప్రచారం సాగుతోంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ టికెట్ కోసం స్థానిక నినాదంతో చాలా మంది ఆశావహులు ఎగబడుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేపై విపరీతమైన ప్రజావ్యతిరేకత కారణంగా టీడీపీ ఈసారి గెలిచి తీరుతుందని, టికెట్ సాధించేద్దామనే ప్రయత్నాలు ఆరంభించారు. కళావెంకటరావు సొంతూరు రాజాం నియోజకవర్గం కాగా, ఆయన తనయుడు ఉండేది అనకాపల్లి, కుటుంబం ఉండేది హైదరాబాద్ కావడంతో ఎచ్చెర్ల టీడీపీ నేతలు సైతం స్థానికేతరులైన కళా కుటుంబం మాకొద్దనే నినాదాలు అందుకున్నారు.