వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు భారీ ఊరట
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు సత్తెనపల్లి సివిల్ కోర్టులో ఊరట లభించింది.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు అమరావతి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమరావతి రాజధాని కోసం ఉద్యమం కొనసాగుతున్న సమయంలో అమరావతి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ 2020 ఫిబ్రవరిలో కేసు నమోదయింది. అమరావతికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు మేరకు నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదయింది. కానీ, అరెస్టులు మాత్రం జరగలేదు. తాజాగా ఎవ్వరూ ఊహించనివిధంగా ఇవాళ నందిగం సురేష్ కోర్టులో లొంగిపోయారు. ఈ వ్యవహారంలో సురేష్ తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరికొందరి పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అండదండలతో వీరిని పోలీసులు అరెస్ట్ చేయలేదు.
అతని తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సివిల్ జడ్జీ నందిగం సురేష్ కి బెయిల్ మంజూరు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిగం సురేశ్ పై వరుస కేసులు నమోదయ్యాయి. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఇటీవలే ఆయన బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో కూడా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యాహ్నం ఆయన కోర్టులో లొంగిపోయారు. ఆయన తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో చికిత్స కోసం బయట ఉన్న నందిగం సురేశ్ కు ఈ కేసులో కూడా బెయిల్ లభించింది.