రాలేను, రాలేను, రాలేను..

సీబీఐకి అవినాష్ రెడ్డి అదే సమాధానం మళ్లీ రిపీట్ చేశారు. తాను విచారణకు హాజరు కాలేనంటూ కరాఖండిగా తేల్చేశారు.

Advertisement
Update: 2023-05-21 14:15 GMT

సీబీఐ: ఈనెల 16న విచారణకు రండి..

అవినాష్ రెడ్డి: నేను రాలేను.

సీబీఐ: పోనీ ఈనెల 19న హాజరుకండి..

అవినాష్ రెడ్డి: నేను రాలేను.

సీబీఐ: ఈనెల 22న అయినా విచారణకు రండి..

అవినాష్ రెడ్డి: నేను రాలేను.

సీబీఐకి అవినాష్ రెడ్డి అదే సమాధానం మళ్లీ రిపీట్ చేశారు. తాను విచారణకు హాజరు కాలేనంటూ కరాఖండిగా తేల్చేశారు. తన తల్లి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు సీబీఐ ముందుకి రాలేనని, ఆవిడ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తనదేనంటూ తాజాగా లేఖ రాశారు.

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. మరోవైపు కోర్టు కూడా సీబీఐకి డెడ్ లైన్ పెట్టి మరీ వ్యవహారం తేల్చేయాలని చెప్పింది. ఈ దశలో సీబీఐ ఇటీవల మరికొంతమందిని అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డి వ్యవహారంలో మాత్రం అడుగు ముందుకు పడటంలేదు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఈ దశలో మరోసారి విచారణకు పిలిపించినా ఆయన మాత్రం రావడం లేదు. వరుసగా మూడు సార్లు వేర్వేరు కారణాలతో ఆయన విచారణకు రాలేదు.

ఈనెల 16న విచారణకు రాలేనని చెప్పడంతో ఆ తర్వాత 19న డేట్ ఫిక్స్ చేసింది సీబీఐ, ఆరోజు తన తల్లికి అనారోగ్యంగా ఉందని, ఆస్పత్రిలో చేర్చారని.. పులివెందుల వెళ్లారు అవినాష్ రెడ్డి. మరోసారి వాట్సప్ ద్వారా నోటీసులు పంపించిన సీబీఐ.. ఈనెల 22న విచారణకు రావాలని కోరింది. ఈసారి కూడా అవినాష్ రెడ్డి విచారణకు రాలేనన్నారు. తన తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ అయిన తర్వాతే సీబీఐ ముందు హాజరవుతానంటూ లేఖ పంపించారు కడప ఎంపీ. ఈ లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News