జగన్‌తో భేటీ జరగకపోయుంటే..

ఏదో సమయం చూసుకుని మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోవాలని సుబ్బారెడ్డి కూడా డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని ఒకసారి ఫైనల్‌గా జగన్‌తో చెప్పాలని వెయిట్ చేశారు. ఈ మధ్యనే కడప జిల్లాలో పర్యటించిన జగన్‌తో సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. అప్పుడు వాళ్ళ మధ్య ఏమి జరిగిందో తెలీదు కానీ రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఖాయమైపోయింది.

Advertisement
Update:2023-02-21 11:04 IST

వైసీపీ తాజాగా ప్రకటించిన మొత్తం 18 మంది ఎమ్మెల్సీల‌ జాబితాలో పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి లక్కీయనే చెప్పాలి. మొదటి నుండి వైఎస్ ఫ్యామిలితో తీవ్రస్థాయిలో శతృత్వం ఉన్న కారణంగా పొన్నపురెడ్డి ఫ్యామిలి టీడీపీలోనే ఉంటున్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా, మంత్రిగా పొన్నపురెడ్డి శివారెడ్డి పెద్ద ఫ్యాక్షన్ లీడర్ అనే చెప్పాలి. అలాంటి శివారెడ్డి చనిపోయిన తర్వాత కొడుకు రామసుబ్బారెడ్డి రాజకీయాల్లోకి వచ్చి తండ్రి వారసత్వాన్నే కంటిన్యూ చేశారు.

అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత చాలామంది రాజకీయం తల్లకిందులైపోయింది. ఇందులో భాగంగానే రామసుబ్బారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైఎస్-పొన్నపురెడ్డి ఫ్యామిలీలకు ఏమాత్రం పడకపోయినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రామసుబ్బారెడ్డి పనిచేయాలని అనుకోవటమే విచిత్రం. అందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో వెంటనే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. అయితే చేరేట‌ప్పుడు ఏమి హామీ ఇచ్చారో తెలీదు కానీ సుబ్బారెడ్డికి ఏ పదవీ దక్కలేదు.

పదవి దక్కకపోగా ఎమ్మెల్యే డాక్టర్ సుదీర్ రెడ్డితో గొడవలవుతున్నాయి. రెండువర్గాలు ఏకం కాలేకపోయాయి. సుబ్బారెడ్డిని పార్టీలో ఎదగనీయకుండా ఎమ్మెల్యే తొక్కేస్తున్నారనే ఆరోపణలు బాగా పెరిగిపోయాయి. దాంతో సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. జగన్ జిల్లాకు వచ్చినప్పుడు కూడా పెద్దగా కలవటంలేదు. ఈ నేపధ్యంలోనే వైసీపీలోకి వచ్చి తప్పుచేశామని కాబట్టి మళ్ళీ టీడీపీలోకే వెళ్ళిపోదామని ఆయన వర్గం సుబ్బారెడ్డిపై బాగా ఒత్తిడి మొదలుపెట్టింది.

ఏదో సమయం చూసుకుని మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోవాలని సుబ్బారెడ్డి కూడా డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని ఒకసారి ఫైనల్‌గా జగన్‌తో చెప్పాలని వెయిట్ చేశారు. ఈ మధ్యనే కడప జిల్లాలో పర్యటించిన జగన్‌తో సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. అప్పుడు వాళ్ళ మధ్య ఏమి జరిగిందో తెలీదు కానీ రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఖాయమైపోయింది. స్థానిక సంస్థ‌ల‌ కోటాలో కడప జిల్లా నుండి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ అయిపోయినట్లే. బలమైన క్యాడర్ ఉన్న రామసుబ్బారెడ్డిని వదులుకోవటం ఇష్టంలేకే జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు అర్థ‌మవుతోంది. ఏమైనా రామసుబ్బారెడ్డిని లక్కీఅనే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News