మేయర్ ఇంటి ముందు చెత్త కుప్ప.. కడపలో రచ్చ రచ్చ
ఎమ్మెల్యే పిలుపు మేరకు కొంతమంది టీడీపీ కార్యకర్తలు, స్థానికులు కడప మేయర్ ఇంటి ముందు చెత్త పారబోశారు.
కడప కార్పొరేషన్ మేయర్ వైసీపీ నేత సురేష్ బాబుకి, స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత మాధవి రెడ్డికి మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు చివరకు రోడ్డుపైకొచ్చింది. కడప కార్పొరేషన్ లో చెత్త సేకరణ సరిగా జరగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పు మీదంటే మీదంటూ మేయర్, ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పిలుపు మేరకు కొంతమంది టీడీపీ కార్యకర్తలు, స్థానికులు కడప మేయర్ ఇంటి ముందు చెత్త పారబోశారు. మేయర్ ఇంట్లో కూడా చెత్తను వేసే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.
అసలేం జరిగింది..?
కడప కార్పొరేషన్ పరిధిలో కొన్నిరోజులుగా చెత్త సేకరణ సరిగా జరగడంలేదు. వాహనాలు సరిగా లేవని, ఉన్నవాటికి మెయింటెనెన్స్ సరిగా లేదని, కార్పొరేషన్ సిబ్బందికి జీతాలిచ్చేందుకు డబ్బులు లేవని అంటున్నారు మేయర్ సురేష్ బాబు. చెత్త పన్ను కడితే కార్పొరేషన్ కి ఆదాయం సమకూరి చెత్త సమస్య తీరుతుందని చెప్పారు. అయితే చెత్తపన్ను విషయంలో గత వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేసిన టీడీపీ నేతలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ పన్ను వసూలులో తడబడుతున్నారు. చెత్తపన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కార్పొరేషన్ కి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. కడపలో సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే దృష్టికి కొందరు ఈ సమస్యను తీసుకెళ్లారు. వైసీపీ ఏలుబడిలో ఉన్న కార్పొరేషన్ దే తప్పు అని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపించారు. కార్పొరేషన్ సిబ్బంది చెత్తను తీసుకెళ్లకపోతే.. మేయర్ ఇంటిముందు పారబోయాలని ఆమె ప్రజలకు సూచించారు. దీంతో అసలు గొడవ మొదలైంది. కొంతమంది నిజంగానే మేయర్ ఇంటి ముందు చెత్త కుప్ప వేశారు.
కడప పట్టణంలో చెత్త సేకరణ అనేది మేయర్, 50మంది కార్పొరేటర్లకు సంబంధించిన వ్యవహారం అని అంటున్నారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకు రావాలని కొంతమంది కార్పొరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చెత్త సేకరణతో ఎమ్మెల్యేకు సంబంధం ఉండదని, అది కార్పొరేషన్ డ్యూటీ అంటున్నారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు, మేయర్.. ఉద్దేశపూర్వకంగానే టీడీపీపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె సలహాతో కొంతమంది మేయర్ ఇంట్లో చెత్త వేసి ఆందోళన తెలపడం ఇప్పుడు సంచలనంగా మారింది.