ఎన్టీఆర్ పేరుతో నాణెం.. ఆ వేడుకకు జూనియర్ దూరం

ఇటీవల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా జూనియర్ దూరంగానే ఉన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు రాక వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2023-08-27 22:21 IST

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరిట 100 రూపాయల ప్రత్యేక నాణెంను విడుదల చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణెంను ఆవిష్కరిస్తారు. ఈనెల 28 (రేపు) ఈ వేడుక రాష్ట్రపతి భవన్ లో జరుగుతుంది. చంద్రబాబు సహా నందమూరి కుటుంబం అంతా తరలి వస్తున్న ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కావడం లేదని తెలుస్తోంది.

తాత పేరు పెట్టుకుని, తాతకు తగ్గ మనవడిగా సినీ రంగంలో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కు పెద్దాయనంటే ఎనలేని గౌరవం. ఆయన జయంతి, వర్థంతి సందర్భంగా ప్రతి ఏడాది ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులర్పిస్తుంటాడు జూనియర్. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. ఆ రెండు రోజులు మాత్రం అందరికంటే ముందుగా ఘాట్ వద్దకు చేరుకునేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే. అలాంటి మనవడు, తాత పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నాణెం విడుదల చేస్తున్న కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం విశేషమే. ప్రస్తుతానికి అతిథులంతా ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ ని కలిసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. పనిలో పనిగా ఈ కార్యక్రమానికి కూడా హాజరవుతారు. నందమూరి వారసులతోపాటు దాదాపు 100మంది అతిథులు ఈ ప్రత్యేక కార్యక్రమానికి వస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హాజరు మాత్రం దాదాపుగా లేదనే చెప్పాలి.

చంద్రబాబుకి దూరం దూరం..

నందమూరి కుటుంబ కార్యక్రమాలకు ఎన్టీఆర్ ఠంచనుగా హాజరవుతున్నా.. చంద్రబాబుకి ఆయన ఇంకా దూరంగానే ఉన్నారు. గతంలో ఓసారి ఎన్టీఆర్ ను టీడీపీ ప్రచారం కోసం వాడుకుని వదిలేయడంతో ఆయన మనసు విరిగిపోయిందని అంటుంటారు సన్నిహితులు. అప్పటినుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు జూనియర్ దూరంగానే ఉన్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు ప్యాచప్ చేసుకోవాలని ప్రయత్నించినా కుదర్లేదు. ఇటీవల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా జూనియర్ దూరంగానే ఉన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు రాక వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

లక్ష్మీపార్వతి గొడవ..

మరోవైపు ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని గొడవ చేస్తున్నారు. ఎన్టీఆర్ భార్యగా తనకు ఆ గౌరవం దక్కాలని, అలాంటిది అసలు ఆ కార్యక్రమానికి తనకు ఆహ్వానమే లేకుండా చేశారని వాపోయారు. రాష్ట్రపతికి ఆమె లేఖ రాసినా ఫలితం లేదని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News