సినీ ఇండస్ట్రీ వ్యక్తికి మరో కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
తాజాగా ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా సినీ ఇండస్ట్రీకి చెందిన ఎల్. జోగి నాయుడుని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సినీ ఇండస్ట్రీకి టీడీపీతో ఎక్కువ సంబంధం ఉందని అనుకుంటారంతా. కానీ వైసీపీ హయాంలోనే సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులకు పలు కీలక పదవులు లభించాయి, లభిస్తున్నాయి కూడా. అప్పట్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వికి ఎస్వీబీసీ పదవి ఇచ్చారు సీఎం జగన్. కానీ దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ఆ తర్వాత అలీ, పోసాని కృష్ణమురళికి వరుసగా అవకాశాలు వచ్చాయి. సింగర్ మంగ్లి వంటి వారికి కూడా వైసీపీ ప్రభుత్వం ప్రోత్సాహం లభించింది. తాజాగా ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా సినీ ఇండస్ట్రీకి చెందిన ఎల్. జోగి నాయుడుని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరీ జోగి నాయుడు..?
శాటిలైట్ ఛానెల్స్ జనాలకు అలవాటవుతున్న కొత్తల్లో జెమినీ టీవీలో వచ్చే జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడు జోగి నాయుడు. సినిమాల్లో అడపాదడపా కొన్ని క్యారెక్టర్లు వేసినా బేసిక్ గా జోగి నాయుడు డైరెక్టర్. పూరీ జగన్నాథ్, కృష్ణవంశీతో కలసి పనిచేసిన అనుభవం ఉంది. టీవీ ఇండస్ట్రీలో ప్రోగ్రామ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక జోగి నాయుడు పర్సనల్ లైఫ్ కూడా ఆసక్తికరమే. ప్రముఖ యాంకర్ ఝాన్సీని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమెతో విడిపోయి మరో వివాహం చేసుకున్నారు జోగి నాయుడు. ఇటీవల పెద్దగా వార్తల్లో లేని ఈయన సడన్ గా ఏపీ ప్రభుత్వం ఆశీర్వాదం తీసుకుని లైమ్ లైట్లోకి వచ్చారు.
విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం జోగినాయుడు స్వగ్రామం. వైసీపీలో కీలక నేత సపోర్ట్ వల్లే ఆయనకు ఈ పదవి లభించినట్టు తెలుస్తోంది. ఆమధ్య విశాఖ రాజధానిగా చేయాలంటూ డిమాండ్ చేసిన సినీ నటుల్లో జోగి నాయుడు కూడా ఒకరు. విశాఖ గర్జనలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ దశలో ఆయనకు అనుకోకుండా ఈ పదవి వరించింది. జోగి నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. జోగినాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది.