ప్రేమ వ్యవహారం వద్దన్నందుకు ప్రాణం తీశాడు – విజయవాడలో ఘటన

తన కుమార్తె వెంట పడొద్దని చెప్పడమే కాదు.. ఇంటికొచ్చి మరీ తన తల్లి ఎదుటే మందలించాడని కక్ష పెంచుకున్న ఓ యువకుడు ఆయన్ని దారుణంగా హతమార్చాడు. గురువారం రాత్రి విజయవాడ కృష్ణలంకలో ఈ ఘటన జరిగింది.

Advertisement
Update:2024-06-28 14:39 IST

తన కుమార్తె వెంట పడొద్దని చెప్పడమే కాదు.. ఇంటికొచ్చి మరీ తన తల్లి ఎదుటే మందలించాడని కక్ష పెంచుకున్న ఓ యువకుడు ఆయన్ని దారుణంగా హతమార్చాడు. గురువారం రాత్రి విజయవాడ కృష్ణలంకలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి కృష్ణలంక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక బృందావన్‌ కాలనీలోని సింధూభవన్‌ వీధిలో కంకిపాటి శ్రీరామ్‌ ప్రసాద్‌ (56) వంశీ జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు విధ్యాధరపురం చెరువు సెంటర్‌లో నివాసముంటున్నారు.

శ్రీరామ్‌ ప్రసాద్‌ పెద్ద కూతురు దర్శిని (22) బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది. విజయవాడలోని శ్రీపొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఆమెకు గడ్డం శివమణికంఠతో నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దలతో మాట్లాడగా.. వేర్వేరు కులాలు కావడంతో వారు అంగీకరించలేదు. ఆ తర్వాత కూడా శివమణికంఠ తన కుమార్తె వెంట పడుతుండటం గమనించిన శ్రీరామ్‌ ప్రసాద్‌.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొందరు వ్యక్తులతో కలసి అతనికి ఇంటికి వెళ్లి అతని తల్లి దృష్టికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తన కుమార్తె వెంటపడొద్దని అతన్ని మందలించాడు. శివమణికంఠ తల్లి కూడా కుమారుడిని వారించింది.

దీంతో శ్రీరామ్‌ ప్రసాద్‌పై కక్ష పెంచుకున్న శివమణికంఠ అదును కోసం ఎదురు చూశాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న శ్రీరామ్‌ ప్రసాద్‌పై ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న దర్శిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా అతను లెక్కచేయలేదు. శ్రీరామ్‌ ప్రసాద్‌ను కింద పడేసి కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీరామ్‌ ప్రసాద్‌ని స్థానికులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. దాడి సమయంలో అడ్డుకోబోయిన దర్శినికి కూడా స్వల్పంగా కత్తి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం పరారీలో ఉన్న శివమణికంఠను అరెస్ట్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News