నన్ను చంపాలని కుట్ర జరుగుతోంది.. - విశాఖ సీపీకి ఫిర్యాదు చేసిన సీబీఐ మాజీ జేడీ

తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన లక్ష్మీనారాయణ.. అది గాలి జనార్దన్‌రెడ్డి అనుచరుల నుంచే అని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Advertisement
Update:2024-04-27 07:52 IST

ఏపీలో ఎన్నికల వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ మాజీ జేడీ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందంటూ విశాఖ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు ఫిర్యాదు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఇప్పటికే విశాఖపట్నంలో తన కదలికలపై రెక్కీ నిర్వహించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తన అనుమానాలు ఎవరిపై అన్న విషయం కూడా ఆయన క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

జేడీ లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో.. పలు హై ప్రొఫైల్‌ కేసులను డీల్‌ చేశారు. వాటిలో సత్యం రామలింగరాజు కేసు, గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులతో పాటు ఇంకా అనేక కేసులను ఆయన డీల్‌ చేయడం గమనార్హం. ప్రస్తుతం విశాఖ నార్త్‌ నియోజకవర్గం నుంచి జై భారత్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్న జేడీ.. ఉన్నఫళంగా ఈ ఫిర్యాదు చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దీంతో గతంలో ఆయన సీబీఐ జేడీగా ఉన్నప్పుడు డీల్‌ చేసిన కేసులకు సంబంధించిన వ్యక్తుల నుంచే ఆయనకు ప్రాణహాని ఉండి ఉండొచ్చనే చర్చ తెరపైకి వచ్చింది.

అయితే.. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన లక్ష్మీనారాయణ.. అది గాలి జనార్దన్‌రెడ్డి అనుచరుల నుంచే అని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన కొందరు అనుచరులు విశాఖపట్నంలో ఉన్నారని, వారు తన కార్యకలాపాలను గమనిస్తున్నారని ఆయన కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. తనను హత్య చేయడానికి సిద్ధమైన వారు.. రెక్కీ కూడా చేశారని తెలిపారు. దీంతో ఆయన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాలి.

లక్ష్మీనారాయణ తన యూపీ కేడర్‌ ఐపీఎస్‌కి రాజీనామా చేసిన తర్వాత 2019లో రాజకీయ ప్రవేశం కూడా చేసి జనసేన పార్టీ నుంచి విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సుమారు 2.88 లక్షల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచిన లక్ష్మీనారాయణ.. ఆ తర్వాత జై భారత్‌ నేషనల్‌ పార్టీని స్థాపించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన విశాఖ నార్త్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం కూడా చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News