జనసేనకు కీలక నేత గుడ్ బై
పవన్ అంటే పిచ్చి అభిమానమని చాలాసార్లు చాటుకున్నఆకుల కిరణ్ కుమార్ పార్టీ తరపున టీవీ డిబేట్లలో బాగా కనిపిస్తుంటారు. మంచి విషయ పరిజ్ఞానం ఉన్న ఆకుల హఠాత్తుగా జనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆతృతపడుతున్న సమయంలోనే పార్టీలో కీలక నేత గుడ్ బై చెప్పేశారు. విజయవాడ కేంద్రంగా ఆకుల కిరణ్ కుమార్ చాలాకాలంగా పార్టీలో పనిచేస్తున్నారు. పవన్ అంటే పిచ్చి అభిమానమని చాలాసార్లు చాటుకున్న కిరణ్ పార్టీ తరపున టీవీ డిబేట్లలో బాగా కనిపిస్తుంటారు. మంచి విషయ పరిజ్ఞానం ఉన్న ఆకుల హఠాత్తుగా జనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
టీడీపీతో జనసేన పొత్తును వ్యతిరేకిస్తున్న కారణంగానే కిరణ్ పార్టీకి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కాపులు, కమ్మలు కలవాలని బహిరంగంగానే పవన్ పిలుపిచ్చిన విషయం తెలిసిందే. బందరు బహిరంగసభలో మాట్లాడుతూ.. కమ్మ వాళ్ళమ్మాయి రత్నకుమారిని కాపు నేత వంగవీటి మోహనరంగా వివాహం చేసుకున్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. కమ్మ-కాపులకు పుట్టిన వ్యక్తిగా వంగవీటి రాధాకృష్ణను పవన్ అభివర్ణించారు.
నిజానికి రంగా-రత్నకుమారి వివాహం, రాధా పుట్టుక గురించి పవన్ బహిరంగసభలో ఎందుకు ప్రస్తావించారో చాలా విచిత్రంగా ఉంది. బహుశా పవన్ ఉద్దేశం కమ్మలు, కాపులు ఒకటే అని చెప్పటం కావచ్చు. ఈ విషయంలోనే చాలామంది కాపు ప్రముఖులు పవన్‌పైన మండిపోతున్నారు. కాపులు, కమ్మలు ఒకటే అయితే మరి రంగాను మర్డర్ చేయించింది ఎవరు? అన్న చర్చ పార్టీలో మొదలైంది. రంగాను చంపించింది చంద్రబాబు నాయుడే అని చేగొండి హరిరామజోగయ్య తాను రాసిన పుస్తకంలోనే ప్రస్తావించారు.
అలాగే రంగాను చంపించినట్లే తనను కూడా చంపించేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని కాపు నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాలపై ఇప్పుడు కాపు సమాజంలో బాగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆకుల కిరణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిరణ్ రాజీనామాను పార్టీ పెద్దలు ఏ విధంగా చూస్తారో తెలీదు కానీ స్ట్రాంగ్ సపోర్టర్‌ను పార్టీ పోగొట్టుకున్నది మాత్రం వాస్తవం. ముందుముందు ఇంకెంతమంది కిరణ్ బాటలో నడుస్తారు అన్నది ఆసక్తిగా మారింది.