మళ్లీ ట్విట్టర్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన నాగబాబు
అల్లు అర్జున్‌ను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారడంతోనే ఆయన తన ట్వీట్‌ని తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మళ్లీ ట్విట్టర్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసి నాగబాబు ఇటీవల ఓ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్‌కి కౌంటర్‌గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబును ట్రోల్స్ చేయడంతో ఆయన తన ట్విట్టర్ నుంచి పరారయ్యారు. ఖాతాను డీయాక్టివేట్ చేశారని ప్రచారం జరిగింది.
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు మద్దతు నిలిచిన సంగతి తెలిసిందే. నాగబాబుతో పాటు వరుణ్ తేజ్, సాయిదుర్గ తేజ్, వైష్ణవ తేజ్ పిఠాపురానికి వెళ్లి జనసేన తరపున ప్రచారం చేశారు. అయితే అదే సమయంలో మెగా కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు.
ఇదిలా ఉంటే పోలింగ్‌కు ఒక రోజు ముందు అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి తన మిత్రుడు, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతు పలికారు. అయితే ఇది మెగా కుటుంబంలో చిచ్చు రేపింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండగా కేవలం ట్వీట్ ద్వారా మద్దతు తెలిపిన అల్లు అర్జున్, తన మిత్రుడి కోసం మాత్రం నంద్యాల వరకు వెళ్లడం మెగా ఫ్యామిలీ, జనసేన శ్రేణులకు రుచించలేదు.
ఆ సమయంలో నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే' అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారన్నది క్లారిటీ లేకపోయినప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోనే విమర్శించారని భావించారు. నాగబాబును ట్రోల్స్ చేస్తూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో నాగబాబు తన ట్విట్టర్ ఖాతాని రెండు రోజుల కిందట డీయాక్టివేట్ చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు నాగబాబు మళ్ళీ తన ట్విట్టర్ ఖాతాని యాక్టివేట్ చేశారు. 'నేను చేసిన ట్వీట్ ని తొలగించాను ' అంటూ మరో ట్వీట్ చేశారు. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారడంతోనే ఆయన తన ట్వీట్‌ని తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నాగబాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇవ్వడంపై కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. నాగబాబు తాను చేసిన ట్వీట్ ని తొలగించడాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్వాగతిస్తుండగా.. మెగా ఫ్యాన్స్ మాత్రం ఖండిస్తున్నారు. అల్లు అర్జున్ పై చేసిన ట్వీట్ తొలగించాల్సిన అవసరం ఏముందని నాగబాబును ప్రశ్నిస్తున్నారు.