అసమర్థ పాలన.. నాగబాబు కౌంటర్లు మళ్లీ మొదలు
వైసీపీ అసమర్థ పాలనకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలన్నారు నాగబాబు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ పై గవర్నర్ కి ఫిర్యాదు చేయడాన్ని ఆయన తన ట్వీట్ లో ప్రస్తావించారు.
జనసేన నేత నాగబాబు మళ్లీ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమధ్య మంత్రుల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడిన నాగబాబు, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. వైసీపీ అసమర్థ పాలనకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలన్నారు నాగబాబు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ పై గవర్నర్ కి ఫిర్యాదు చేయడాన్ని ఆయన తన ట్వీట్ లో ప్రస్తావించారు.
“చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాలు”. డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలందక, ఆందోళన చేయడానికి అనుమతివ్వక, ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలున్న గవర్నర్ కు మొర పెట్టుకునే స్థితికి తీసుకొచ్చారు. అంటూ ట్వీట్ వేశారు నాగబాబు.
పవన్ కల్యాణ్ రణస్థలం సభ నేపథ్యంలో నాగబాబు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది. పవన్ కి మద్దతుగా మాట్లాడిన నాగబాబు మంత్రులపై ఘాటు విమర్శలు చేశారు. అయితే నాగబాబుని కూడా వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ చేశారు.
గతంలో ఆయన చంద్రబాబుకి వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలను బయటకు తీశారు. ఇప్పుడు బాబుగారు చుట్టాలైపోయారా అంటూ చురకలంటించారు. కొన్నిరోజులుగా వాతావరణం ప్రశాంతంగానే ఉంది. మళ్లీ ఉద్యోగ సంఘాలు గవర్నర్ ని కలవడంతో ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఉద్యోగ సంఘాల్లోనే మరో వర్గం ఈ విషయాన్ని తప్పుబట్టింది. అంటే దాదాపుగా ఏపీలో ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోయాయనే చెప్పాలి. ఓ వర్గానికి ఇప్పుడు టీడీపీ, జనసేన మద్దతు తెలిపే పరిస్థితి వచ్చేసింది. తాజాగా నాగబాబు వేసిన ట్వీట్ తో మరింత కాకరేగింది.