జనసేన ఎక్స్‌ట్రా ప్లేయర్‌ నోటికి హద్దులు లేవా..?

2023-24 ఆర్థిక సంవత్సరంలో మంత్రులు, చైర్మన్లు, సలహాదారుల కోసం జరిపిన బడ్జెట్‌ కేటాయింపులు రూ.29.61 కోట్లు. అలాంటప్పుడు ఒక్కో సలహాదారులకు వందల కోట్లు చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది..?

Advertisement
Update:2024-02-03 10:29 IST

జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్‌ ఎక్స్‌ట్రా ప్లేయర్‌. ఆ ఎక్స్‌ట్రా ప్లేయర్‌ నోటికి హద్దులు లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ సలహాదారుల గురించి వాగేశాడు. దాన్ని ఈనాడు దినపత్రిక తాటికాయంత అక్షరాలతో అచ్చేసింది. అది సరే, గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉన్న సలహాదారులు, కన్సల్టెంట్స్‌ ఎంత మంది, వారికి చెల్లించిన సొమ్ము ఎంత అనే విషయాలను నాదెండ్ల మనోహర్‌ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు..? చంద్రబాబును ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలని తాపత్రయపడుతున్న తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు, ఈనాడు రామోజీరావుకు, చంద్రబాబుకు సంతోషం కలిగించడానికి ఆయన నోరు పారేసుకున్నారని అనుకోవాలా..? వాళ్ల మెప్పు కోసం ఇంతగా దిగజారిపోవాలా..?

జగన్‌ ప్రభుత్వం 89 మంది సలహాదారులను నియమించిందని, వారికి ఇప్పటి వరకు రూ.680 కోట్లు చెల్లించిందని, ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే రూ.140 కోట్లు చెల్లించిందని నాదెండ్ల మనోహర్‌ అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలనే ఇంగితం నాదెండ్ల మనోహర్‌ వంటి పెద్ద మనిషికి ఉండక్కర్లేదా..? అసలు ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు కేవలం 46 మందే. ఒక్కొక్కరికి జీతభత్యాల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది నెలకు లక్షన్నర రూపాయల లోపే. అటువంటప్పుడు కోట్ల రూపాయల మాట ఎందుకు వస్తుంది..?

2023-24 ఆర్థిక సంవత్సరంలో మంత్రులు, చైర్మన్లు, సలహాదారుల కోసం జరిపిన బడ్జెట్‌ కేటాయింపులు రూ.29.61 కోట్లు. అలాంటప్పుడు ఒక్కో సలహాదారులకు వందల కోట్లు చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది..? రాష్ట్ర ప్రభుత్వం ఐదు కెటగిరీలుగా సలహాదారులను నియమిస్తుంది. కెటగిరీ ‘ఎస్‌’ కింద నియమితులైనవారికి క్యాబినెట్‌ ర్యాంక్‌ ప్రోటోకాల్‌ మాత్రమే ఉంటుంది. వారికి సిబ్బంది గానీ జీతభత్యాలు గానీ వుండవు. క్యాబినెట్‌ ర్యాంక్‌ కింద నియమితులైన సలహాదారులకు క్యాబినెట్‌ మంత్రులతో సమానంగా వసతులు కల్పిస్తారు. ప్రముఖ క్యాన్సర్‌ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయ, డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ ఏ విధమైన గౌరవ వేతనాలు లేకుండా సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని డిజైన్ల పేరుతో ప్రచారం కోసం కన్సల్టెన్సీల‌కు, సలహాదారులకు వందల కోట్ల రూపాయలు ధారపోశారు. నార్మన్‌ పోస్టర్‌, సుర్బానా జురాంగ్‌ తదితర కన్సల్టెన్సీ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో 42 మంది సలహాదారులను, 99 మంది కన్సల్టెంట్స్‌ను నియమించారు. మొత్తం 141 మందిని నియమించారు. జగన్‌ ప్రభుత్వంలో నియమితులైన సలహాదారులు, కన్సల్టెంట్ల సంఖ్య కేవలం 123 మాత్రమే. ఈ వాస్తవాలను తెలుసుకుని నాదెండ్ల మనోహర్‌ మాట్లాడి ఉంటే గౌరవం పెరిగి ఉండేది. ఆయనకు అది అక్కర్లేదు. చంద్రబాబు, రామోజీల మెప్పు కావాలి. ఎన్నికల్లో వారి దయాదాక్షిణ్యాలతో పోటీకి ఓ సీటు కావాలి.

Tags:    
Advertisement

Similar News