మరో టికెట్ ఖాయం చేసిన పవన్.. టీడీపీకి మరింత మంట

గజపతి నగరం జనసేన టికెట్ పడాల అరుణకు ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే ఆమె పార్టీలో చేరారని అంటున్నారు. అంటే అక్కడ టీడీపీ, బీజేపీకి అవకాశం లేదనే అనుకోవాలి.

Advertisement
Update:2023-08-11 09:03 IST

ఇటీవల ఒకరిద్దరు నేతలకు కండువాలు కప్పి ఫలానా సీటు వారిదేనంటూ ప్రకటించేస్తున్నారు పవన్ కల్యాణ్. ఆమధ్య తెనాలిలో కూడా నాదెండ్ల మనోహర్ కి భారీ మెజార్టీ రావాలంటూ జనసేన నేతలకు సూచించారు. మరి ఇందులో పొత్తు ధర్మం ఎక్కడుంది. బీజేపీతో కనీసం సంప్రదింపులు కూడా జరపకుండా పవన్ హామీలిచ్చుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికల టైమ్ కి టీడీపీతో పొత్తు కుదిరినా ఆయా నియోజకవర్గాల్లో మడతపేచీ ఖాయం. ఈ దశలో గజపతి నగరం టికెట్ కూడా పవన్ కల్యాణ్ దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పడాల అరుణ చేరిక సందర్భంగా పవన్, గజపతి నగరంలో జనసేన పోటీ చేస్తుందని తేల్చేశారు.


అరుణ నేపథ్యం..

గజపతినగరం నుంచి పడాల అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994, 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 2009లో మాత్రం ఆమె ఓడిపోయారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ రెండేళ్ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆమె జనసేనలో చేరారు. జనసేన కండువా కప్పుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరమని చెప్పారు పడాల అరుణ.

గజపతి నగరం ఖాయమేనా..?

గజపతి నగరం జనసేన టికెట్ పడాల అరుణకు ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే ఆమె పార్టీలో చేరారని అంటున్నారు. అంటే అక్కడ టీడీపీ, బీజేపీకి అవకాశం లేదనే అనుకోవాలి. పైగా టీడీపీ మాజీ నేతను జనసేనలో చేర్చుకోవడం కూడా విశేషమే. టీడీపీలో టికెట్ రాదని తెలిసి బయటకు వచ్చి, ఇప్పుడు జనసేనలో చేరారు పడాల అరుణ. పొత్తు ఖాయమైతే రేపు టీడీపీ కూడా అక్కడ అరుణకు మద్దతివ్వాల్సిన పరిస్థితి. ఈ వ్యవహారమంతా టీడీపీ నాయకులకు మింగుడుపడటంలేదు. టీడీపీ నుంచి వెళ్లినవారందరికీ జనసేన ఆశ్రయమిస్తే, రేపు టికెట్ల వ్యవహారంలో తేడాలొస్తాయని అంటున్నారు. అయితే అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు కాబట్టి ఎవరూ బయటపడటంలేదు. 

Tags:    
Advertisement

Similar News