కడపకు పవన్.. టార్గెట్ జగన్..
ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్రను మొదలు పెట్టిన పవన్, ఇప్పుడు కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రకు సిద్ధమయ్యారు.
ఆమధ్య జనవాణి అంటూ హడావిడి చేసిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని మళ్లీ జనంలోకి వస్తున్నారు. వస్తూ వస్తూనే నేరుగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తున్నారు పవన్. జగన్ సొంత జిల్లా కడపలో ఆయన పర్యటించబోతున్నారు. పవన్ కల్యాణ్ వచ్చారంటే ఏదో అయిపోతుందని కాదు కానీ, నేరుగా జగన్ ఇలాకాలో పవన్ పర్యటించడం, సీఎంపైనే విమర్శనాస్త్రాలు సంధించాలనుకోవడం సాహసమనే చెప్పాలి. ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ రాజకీయ నాయకులు ఇలాంటి సాహసాలు చేయక తప్పదు. అందుకే పవన్ నేరుగా జగన్ ఇలాకాలో అడుగు పెడుతున్నారు. కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించే పేరుతో కడపలో జనసేన బలం ఎంతుందో అంచనా వేయాలనుకుంటున్నారు.
తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది వైసీపీ. రైతుల కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం సేకరణతో రైతులకు మేలు చేస్తున్నామంటోంది. అయితే పంట నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పలకరించే దిక్కులేదంటూ జనసేన విమర్శిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తన సొంత నిధులతో కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్రను మొదలు పెట్టిన పవన్, ఇప్పుడు కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 20న కడప జిల్లాలో పర్యటించబోతున్నారు పవన్. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నారు.
జగన్ ఇలాకాలో రచ్చబండ..
రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్, కడప జిల్లా జనసేన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రైతుల విషయంలో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టిన పవన్, ఇప్పుడు నేరుగా జగన్ జిల్లాకే వచ్చి ఆయన్ను టార్గెట్ చేస్తూ సవాళ్లు విసరబోతున్నారు. ఇప్పటి వరకూ ఇతర ప్రాంతాల్లో పర్యటించినా పవన్ కి పెద్దగా నిరసన ఎదురు కాలేదు. తొలిసారి జగన్ సొంత జిల్లాలో, అందులోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సొంత కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు పవన్. ఈ కార్యక్రమం ఎలాంటి పర్యవసానాలకు దారి తీస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి పవన్ పర్యటన నేపథ్యంలో కడప జిల్లా జనసేన శ్రేణులు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి.