జనసేన కాదు పవనే టార్గెట్.. ఓడించక గెలిపిస్తారా?

కత్తిపూడి బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ జనసేన అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. ఇక్కడ పవన్ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే వైసీపీ అయినా జగన్ అయినా టార్గెట్ చేస్తున్నది పవన్‌నే కానీ జనసేనను కాదు.

Advertisement
Update:2023-06-15 10:55 IST

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే 151 సీట్లలో గెలిచిన వైసీపీ+జగన్మోహన్ రెడ్డి జనసేనంటే భయపడిపోతున్నారు. వారాహియాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో యాత్రను పవన్ మొదలుపెట్టారు. బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ.. జనసేన అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. ఇక్కడ పవన్ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే వైసీపీ అయినా జగన్ అయినా టార్గెట్ చేస్తున్నది పవన్‌నే కానీ జనసేనను కాదు.

వైసీపీ అయినా జగన్ అయినా అసలు జనసేనను ఒక పార్టీగానే లెక్కేచేయటంలేదు. వాళ్ళ టార్గెట్ అంతా పవన్ మాత్రమే. పవన్‌ను కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే పవన్ కూడా వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు కాబట్టే. నిఖార్సయిన ప్రత్యర్థిగా కాకుండా చంద్రబాబునాయుడు ప్రయోజనాలే లక్ష్యంగా జగన్+ప్రభుత్వాన్ని పవన్ పదే పదే టార్గెట్ చేస్తున్నారు. సమయం, సందర్భం లేకపోయినా జగన్‌ను జనసేన అధినేత పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనే పవన్‌ను కూడా మంత్రులు, అధికార పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారు.

ఇదే సభలో పవన్ మరో విచిత్రమైన వ్యాఖ్య చేశారు. అదేమిటంటే తనను కక్షగట్టి 2019 ఎన్నికల్లో వైసీపీ ఓడించిందట. ప్రతి ఒక్క‌రూ తమ ప్రత్యర్థులను ఓడించేందుకే చూస్తారు కదా ఇందులో తప్పేముంది? వైసీపీకి టీడీపీ, జనసేన ప్రత్యర్థులు కాబట్టి ఈ పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులను ఓడించాలని వైసీపీ ప్రయత్నించటంలో తప్పేముంది? ఇదే పవన్ చిత్తూరు రోడ్డుషోలో మాట్లాడుతూ.. వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాను.. జగన్ సీఎం ఎలాగవుతారో చూస్తాను అని చాలెంజ్ చేశారు. వైసీపీని గెలవనివ్వనని, జగన్‌ను సీఎం కానివ్వనని తాను చాలెంజ్ చేస్తే తప్పుకాదు. తనను ఓడించటం మాత్రం వైసీపీ చేసిన తప్పని చెప్పటమే విచిత్రంగా ఉంది.

నిజంగా పవన్ లాజిక్ మాత్రం భలేగుంది. ఇలాంటి పిచ్చి లాజిక్కులతో మాట్లాడటం మానేసి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో ఆలోచించుకుంటే మంచిది. లేకపోతే 2019 ఎన్నికల్లో ఫలితమే రిపీట్ అయినా ఆశ్చర్యంలేదు. ఏ రాజ‌కీయ పార్టీ అయినా ప్రత్యర్థిని ఓడించటానికే చూస్తుంది కానీ ఓట్లేసి గెలిపిస్తుందా.. పవన్ అలా ఎలా అనుకున్నారో అర్థం కావటంలేదు.

Tags:    
Advertisement

Similar News