ఎవరికోసం.. ఎందుకోసం.. జనసేన మరో త్యాగం..!
జనసేనాని తీరుపై ఇప్పటికే జనసైనికులు, కాపు సామాజికవర్గం నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కేవలం 24 అసెంబ్లీ సీట్లకే అంగీకరించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారైంది. గతంలో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించారు జనసేనాని. తాజాగా కూటమిలో చేరిన బీజేపీ 8 ఎంపీ స్థానాలు కోరగా.. బీజేపీ, జనసేనలకు కలిపి 8 ఎంపీ సీట్లు, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు దక్కనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు కేటాయించిన 3 ఎంపీ సీట్లలో ఒక సీటును బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు పవన్‌ను కోరినట్లు సమాచారం.
అయితే 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించింది. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసేందుకు సిద్ధపడింది. అనకాపల్లి నుంచి నాగబాబు, మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి, కాకినాడ నుంచి సానా సతీష్‌కుమార్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ, ఇప్పుడు జనసేన ఓ సీటును బీజేపీకి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జనసేన రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి పరిమితం కానుంది. బీజేపీ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయనుండగా.. మిగిలిన 17 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు సమాచారం.
జనసేనాని తీరుపై ఇప్పటికే జనసైనికులు, కాపు సామాజికవర్గం నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కేవలం 24 అసెంబ్లీ సీట్లకే అంగీకరించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్‌కల్యాణ్‌ను సైతం ఎంపీగా పోటీ చేయాలని అమిత్ షా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏ స్థానం నుంచి పవన్ పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. జనసేనకు కేటాయించిన 2 ఎంపీ స్థానాల్లో ఓ స్థానం నుంచి పవన్ పోటీ చేస్తే.. ప్రస్తుతమున్న ఆశావహుల్లో ఎవరిని తప్పిస్తారనేది సస్పెన్స్‌గా మారింది.