ఐదింటిపై జనసేన ఫుల్ ఫోకస్

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నగిరి, మదనపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిందే అని పార్టీ తీర్మానించిందట.

Advertisement
Update:2023-10-11 11:46 IST

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ - జనసేన పొత్తు సజావుగా సాగుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే టీడీపీ ఏఏ నియోజకవర్గాల్లో అయితే స్ట్రాంగ్ అని అనుకుంటోందో వాటిల్లో కొన్నింటిపై జనసేన కూడా బాగా ఫోకస్ చేస్తోంది. ఉదాహరణ తీసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నగిరి, మదనపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిందే అని పార్టీ తీర్మానించిందట.

ఈ మధ్యనే పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ పోటీ చేయాల్సిందే అనే డిమాండ్లు బాగా వినిపించినట్లు సమాచారం. ఇందులో కూడా తిరుపతి, నగిరిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారట. తిరుపతిలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తే గెలుపు గ్యారెంటీ అని చెప్పారట. అలాగే నగిరిలో రోజాను ఓడించటమే టార్గెట్‌గా పనిచేయాలని కూడా అనుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో చిరంజీవి సెంటిమెంటును నేతలు నాగబాబుతో ప్రస్తావించారట.

రోజా నుండి పార్టీ చాలా ఇబ్బందులు పడుతోంది. పవన్‌ను డైరెక్ట్‌గా మంత్రి రోజా ప్రతిరోజు ఎటాక్ చేస్తునే ఉన్నారు. రోజా అంటేనే జనసేన నేతలు మండిపోతున్నారు. ఆమెను ఓడించటమే టార్గెట్‌గా నగిరిలో పార్టీ పావులు కదుపుతోంది. మొన్నటివరకు నగిరిలో రోజా మీద టీడీపీ తరపున పోటీ చేయబోయేది భాను ప్రకాషే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా భాను పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.

అలాంటిది తాజా డెవలప్మంట్లలో నగిరిలో టీడీపీ కాకుండా జనసేన పోటీ చేయాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. పై ఐదు సీట్లలో జనసేన గెలిచే అవకాశాలపై నాగబాబు కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే విషయమై పవన్‌తో మాట్లాడుతానని నాగబాబు లోకల్ నేతలకు హామీ ఇచ్చారట. ఇదంతా చూస్తుంటే ఐదు నియోజకవర్గాల్లో పోటీ విషయంలో జనసేన పట్టుబ‌ట్టేలా కనబడుతోంది. ఎందుకంటే జనసేన నేతలు ఆ మేర‌కు ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.


Tags:    
Advertisement

Similar News