వర్మపై జనసైనికుల దాడి.. ఆయన పనేనా?
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడి జనసేనలో చేరిన 25 మందే తనపై దాడి చేశారని చెప్పారు. ఉదయ్ శ్రీనివాస్ గత 8 నెలలుగా ఓ వర్గంతో తెలుగుదేశంపై దాడులు చేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మపై జనసైనికులు దాడిచేశారు. జనసైనికుల దాడిలో వర్మ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. శుక్రవారం రాత్రి గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో ఈ ఘటన జరిగింది. ఇటుకలు రాళ్లతో వర్మ కారుపై విరుచుకుపడ్డారు జనసైనికులు. వర్మతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తనపై దాడి చేసింది కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరులేనని ఆరోపించారు వర్మ. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడి జనసేనలో చేరిన 25 మందే తనపై దాడి చేశారని చెప్పారు. ఉదయ్ శ్రీనివాస్ గత 8 నెలలుగా ఓ వర్గంతో తెలుగుదేశంపై దాడులు చేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో హీరో సాయి ధరమ్ తేజ్ మీద దాడి చేసింది ఈ బృందమేనన్నారు వర్మ. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఈ దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు వర్మ.
ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పిఠాపురం సీటు ఆశించారు వర్మ. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు నుంచి జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ పోటీ చేసి గెలిచారు. పవన్‌కల్యాణ్ గెలుపు కోసం వర్మ తీవ్రంగా కృషి చేశారు. అలాంటి వర్మపై జనసైనికులు దాడి చేయడం సంచలనంగా మారింది.