కర్ణాటకలో పవన్ పర్యటన లేదు - జనసేన క్లారిటీ
కర్ణాటకలో ఏపీ సరిహద్దు జిల్లాల్లో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఈనెల 17 నుంచి పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని ప్రచారం జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల తరపున త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ లో ఈనెల 17న బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని ఇవాళ ఉదయం నుంచి ప్రధాన మీడియా సంస్థలతోపాటు, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
కర్ణాటకలో ఏపీ సరిహద్దు జిల్లాల్లో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఈనెల 17 నుంచి పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై జనసేన స్పందించింది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈనెల 17 నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కాదని, అవాస్తవమని జనసేన పేర్కొంది.
ఈ నెల 17న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని, ఈ పర్యటన ఇప్పటికే ఖరారు అయినట్లు జనసేన తెలిపింది. కొన్ని నెలల కిందట కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రానికి వెళ్లి అక్కడి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కూడా పవన్ కర్ణాటకలో పర్యటించలేదు.