వంగ‌వీటి రాధా ఎంగేజ్‌మెంట్‌.. జ‌న‌సేన‌, వైసీపీ నాయ‌కుల హ‌డావుడి!

తెదేపా నేత‌, న‌రసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు త‌ప్ప తెదేపా నుంచి ఒక్క కీల‌క‌నేత కూడా ఎంగేజ్‌మెంట్‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Update:2023-09-03 21:05 IST

దివంగ‌త వంగ‌వీటి మోహ‌న రంగా త‌న‌యుడు, తెలుగుదేశం పార్టీ నేత వంగ‌వీటి రాధాకృష్ణ నిశ్చితార్థం న‌ర‌సాపురానికి చెందిన జ‌క్కం పుష్ప‌వ‌ల్లితో ఆదివారం న‌ర‌సాపురంలో వైభ‌వంగా జ‌రిగింది. అక్టోబ‌ర్ 22న వీరిద్ద‌రి వివాహానికి ముహూర్తం నిర్ణ‌యించారు. పెళ్లి కుమార్తె ఇంటివద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఇరుప‌క్షాల బంధుమిత్రులు, రంగా అభిమానులు కొంద‌రు పాల్గొన్నారు.

వ‌ధువు జ‌న‌సేన నాయ‌కుల కుమార్తె

నర్సాపురం మున్సిప‌ల్ మాజీ ఛైర్మన్‌ జక్కం అమ్మాణి, బాబ్జీల రెండో కుమార్తె పుష్ప‌వ‌ల్లి. తెలుగుదేశంలో ఉన్న జ‌క్కం ఫ్యామిలీ కొంత‌కాలం కింద‌ట జ‌న‌సేనలో చేరారు. దీంతో న‌ర‌సాపురం జ‌న‌సేన అభ్య‌ర్థిగా గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన బొమ్మిడి నాయ‌క‌ర్‌, జ‌న‌సేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటిక‌ల‌పూడి చిన‌బాబు త‌దితర జ‌న‌సేన నాయ‌కులు ఎంగేజ్‌మెంట్‌కు వ‌చ్చారు. అలాగే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ ముదునూరి ప్ర‌సాద‌రాజు కూడా వ‌చ్చి కాబేయే జంట‌ను ఆశీర్వ‌దించారు. గతంలో టీడీపీ, వైసీపీల్లో ప‌ని చేసిన సీనియ‌ర్ నేత కొత్తప‌ల్లి సుబ్బారాయుడు కూడా హాజ‌ర‌య్యారు.

తెదేపా నేత‌లేరి మ‌రి?

వంగ‌వీటి రంగా కాపు సామాజిక‌వ‌ర్గంలో ఎంతోమందికి ఆరాధ్యుడు. దీంతో స్వ‌త‌హాగానే ఏ పార్టీలో ఉన్నాఆయ‌న విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌కు, జ‌యంతి, వ‌ర్ధంతుల‌కు నేత‌లంతా వెళుతుంటారు. అలాంటి ఆయ‌న కొడుకు రాధా ఎంగేజ్‌మెంట్ జ‌రుగుతుంటే రాకుండా ఎలా ఉంటారు. అందుకే మిగిలిన పార్టీల నుంచి కూడా నేత‌లు వ‌చ్చార‌ని అంటున్నారు. అయితే స్థానిక తెదేపా నేత‌, న‌రసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు త‌ప్ప తెదేపా నుంచి ఒక్క కీల‌క‌నేత కూడా ఎంగేజ్‌మెంట్‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పెళ్లి నిశ్చ‌య‌మైన‌ప్పుడే రాధా జ‌న‌సేన‌లోకి వెళ‌తారని ప్ర‌చారం జ‌రిగినా ఇటీవ‌ల కృష్ణా జిల్లాలో లోకేశ్ పాద‌యాత్ర‌కు హాజ‌రై రాధా ఆ వార్త‌ల‌కు పుల్‌స్టాప్ పెట్టారు. కానీ ఇప్పుడు తెదేపా నేత‌లు ఎవ‌రూ ఎంగేజ్‌మెంట్‌కు ఎందుకు రాలేద‌న్న‌ది మాత్రం చ‌ర్చ‌గా మారింది.


Tags:    
Advertisement

Similar News