షర్మిలకు మరో షాక్.. ఈసారి ఏమైందంటే..?

వైఎస్ఆర్ అభిమానులు కూడా ఆమెకు దూరం జరిగారు. కేవలం చంద్రబాబుకోసమే షర్మిల, జగన్ కి వ్యతిరేకంగా మారారని కడప జిల్లావాసులు బలంగా నమ్ముతున్నారు.

Advertisement
Update: 2024-04-12 14:30 GMT

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో తెలియదు కానీ, ఎల్లో మీడియా మాత్రం షర్మిలకు విపరీతమైన హైప్ ఇస్తోంది. సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ షర్మిల మాట్లాడితే చాలు ఆమెకు ఫుల్ కవరేజ్. ఇదంతా చంద్రబాబు డ్రామా అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రచార పర్వంలో షర్మిలకు వరుస ఎదురుదెబ్బలు తగలడం ఇక్కడ విశేషం. సీఎం జగన్ కు ఎందుకు ఓటు వేయాలనే విషయంలో ఓ యువకుడు మైక్ తీసుకుని మరీ ఆయన గొప్పతనం షర్మిల ముందే వివరించి హైలైట్ అయ్యాడు. మైదుకూరు పర్యటనలో ఆ యువకుడిని తన వద్దకు పిలిచి మరీ మైక్ చేతికిచ్చారు షర్మిల. తీరా అతను సీఎం జగన్ ని పొగడటంతో ఆమె అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో షర్మిలకు తల కొట్టేసినట్టయింది. ఇప్పుడు కడప జిల్లా లింగాలలో కూడా అలాంటి ఘటనే జరిగింది.

జై జగన్..

కడప జిల్లాలోని లింగాలలో కాంగ్రెస్ ప్రచార సభలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు కొందరు యువకులు. వైఎస్ షర్మిల, సునీత ప్రసంగాలను అడ్డుకున్నారు. దీంతో షర్మిల షాకయ్యారు. వారంతా వైసీపీ బ్యాచ్ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ కార్యకర్తలు రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా కడప జిల్లా బిడ్డనేనని, రాజశేఖర్ రెడ్డి కుమార్తెను అనే విషయం మరచిపోవద్దని హెచ్చరించారు. ఆ తర్వాత కూడా కొందరు షర్మిల పర్యటనను అడ్డుకోవడంతో చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఆమెపై కాస్తో కూస్తో సింపతీ ఉండేది. కానీ రాను రాను ఆమె చంద్రబాబు మనిషిలా మారడం, సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, సునీతను పక్కనపెట్టుకుని వివేకా హత్యను రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూడటంతో జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ అభిమానులు కూడా ఆమెకు దూరం జరిగారు. కేవలం చంద్రబాబుకోసమే షర్మిల, జగన్ కి వ్యతిరేకంగా మారారని కడప జిల్లావాసులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆమెకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ఆ వ్యతిరేకతను ఆమె వైసీపీకి అంటగట్టాలని చూడటం ఇక్కడ విశేషం.

Tags:    
Advertisement

Similar News