వర్షాలకు ఏపీ విలవిల.. విజయవాడ ఘటనలో నలుగురు మృతి
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈరోజు(శనివారం) అర్ధరాత్రి ఇది విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో మొత్తం 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇంద్రకీలాద్రి వద్ద కూడా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో.. ఘాట్ రోడ్ పై రాకపోకలను నియంత్రించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలవడంతో.. మూడు బస్సులు, ఒక లారీ అందులో చిక్కుకున్నాయి.
విజయవాడ గుంటూరు మధ్య హైవే నీటమునిగింది. హైవేపై ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణాలకు సాహసించవద్దని చెబుతున్నారు పోలీసులు. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్‌ఆర్ నగర్‌లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ బస్టాండ్ పరిసరాల్లోకి కూడా వరదనీరు చేరింది. రామవరప్పాడు రింగ్‌రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా, నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. అటు గుంటూరు నగరంలో గడ్డిపాడు చెరువు వరదనీటితో పొంగిపొర్లుతోంది. సమీపంలోని లోతట్టుప్రాంతాల్లోకి వరదనీరు వచ్చేసింది. ఇళ్లలోకి నీరు చేరింది. గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు నాయకులు వర్షాల్లో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు.. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారాయన. వర్షాల కారణంగా సీఎం ఓర్వకల్లు పర్యటన రద్దయింది. భారీ వర్షాల నేపథ్యంలో రైలు పట్టాలపైకి కూడా వర్షపు నీరు చేరింది. దీంతో ముందు జాగ్రత్తగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో విజయవాడ మీదుగా నడిచే 20 రైళ్లను అధికారులు రద్దు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈరోజు(శనివారం) అర్ధరాత్రి ఈ వాయుగుండం విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.