ఏపీలో జల విలయం.. వైసీపీ నేతలకు జగన్ కీలక సూచన

బాధితులకు అండగా నిలవాలని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు జగన్ సూచించారు. ప్రస్తుతం ఆయన పులివెందులలో ఉన్నారు.

Advertisement
Update:2024-08-31 19:21 IST

ఏపీలో భారీ వర్షాలకు ప్రాణ నష్టం జరగడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలను వైసీపీ నేతలు ఆదుకోవాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు జగన్.


ఏపీలో జలవిలయం పలువురి ప్రాణాలు తీసింది. విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు దుర్మరణంపాలయ్యారు. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వరద ఉధృతికి వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఒక టీచర్‌ సహా ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. మంగళగిరిలో కొండ చరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందారు. కొన్నిచోట్ల వరదనీటిలో కొట్టుకుపోతున్నవారిని స్థానికులు కాపాడారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎక్కడికక్కడ నాళాలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడి వరదనీరు ఊళ్లనుం ముంచెత్తుతోంది. ఈ దశలో బాధితులకు అండగా నిలవాలని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు జగన్ సూచించారు. ప్రస్తుతం ఆయన పులివెందులలో ఉన్నారు.

అటు సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. కొండచరియలు విరిగి నలుగురు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. 



Tags:    
Advertisement

Similar News