విజయవాడలో వర్ష బీభత్సం.. ఒకరు మృతి
కొండచరియలు విరిగిపడిన ఘటనలో వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొగల్రాజపురం ప్రాంతంలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. సున్నపు బట్టీ సెంటర్ లో కొండచరియలు విరిగి ఇంటిపై పడగా ఒక బాలిక స్పాట్ లోనే మృతి చెందింది మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని పోలీసులు రక్షించారు.
ఎడతెరపి లేకుండా కురిసే వర్షాలకు విజయవాడలో చాలాసార్లు కొండచరియలు విరిగి పడిన ఉదాహరణలున్నాయి. అయితే నిరుపేదలు మాత్రం ప్రమాదం అని తెలిసినా కొండల దిగువన నివాసం ఉంటున్నారు. పలుమార్లు ఇంద్రకీలాద్రి పరిసరాల్లో కూడా కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరిగాయి. తాజాగా మొగల్రాజపురం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రక్షణ చర్యలు వేగవంతం అందుకున్నాయి. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. విజయవాడలో వర్షంపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ తో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.