ఏపీలో నేటినుంచి జగనన్న సురక్ష.. ఏమేం చేస్తారంటే..?
ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేందుకు సీఎం జగన్ ఈ కార్యక్రమాలను రూపొందించారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు, సురక్ష ద్వారా వాటిని ఊరిలోనే పొందే అవకాశం కల్పించారు.
ఏపీలో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బందిని బిజీగా ఉంచేందుకు కొత్త కొత్త కార్యక్రమాలను తెరపైకి తెస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే గడప గడప కార్యక్రమం జరుగుతుండగా, కొత్తగా జగనన్న సురక్ష నేటినుంచి మొదలవుతోంది. సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరం ఉన్నా, లేకపోయినా వారు అడిగిన సర్టిఫికెట్లను రుసుము లేకుండానే ఉచితంగా అందిస్తారు. నెలరోజులపాటు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్యాంపులు నిర్వహిస్తారు అధికారులు. ఈ క్యాంపులకు వారం రోజుల ముందు ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి అధికారులు వెళ్లి, ప్రజలనుంచి సమాచారం సేకరిస్తారు. ఎవరెవరికి ఏమేం సర్టిఫికెట్లు కావాలనేది అడిగి తెలుసుకుంటారు. వాటి వివరాలు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఆ ఊరిలో క్యాంప్ జరిగిన రోజు వాటిని వేదికపైకి పిలిచి అప్పగిస్తారు. ఇదే జగనన్న సురక్ష.
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 1,306 సచివాలయాల పరిధిలో క్యాంపులు జరుగుతున్నాయి. గత నెల 24నుంచి ఆయా సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించారు. సర్టిఫికెట్లు మంజూరుకి సిద్ధం చేశారు. ఈరోజు ఆయా సర్టిఫికెట్లను 1306 సచివాలయాల పరిధిలో జరిగే క్యాంపుల్లో ప్రజలకు అందజేస్తారు. మొత్తంగా 11 రకాల సర్టిఫికెట్లను ఎలాంటి రుసుము లేకుండా అందజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
తమ ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేందుకు సీఎం జగన్ ఈ కార్యక్రమాలను రూపొందించారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు, సురక్ష ద్వారా వాటిని ఊరిలోనే పొందే అవకాశం కల్పించారు. ప్రభుత్వాన్ని మరింతగా ప్రజలకు దగ్గర చేస్తున్నారు.